నవ్యాంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదు అయింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 77.96 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చితే 1.68 శాతం పెరిగింది. అంటే, గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో దాదాపు 25 లక్షల ఓట్లు అదనంగా పడ్డాయి. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన పురుషుల సంఖ్య 1,55,45,211. ఓటు హక్కు వినియోగించుకున్న మహిళల సంఖ్య 1,57,87,759. ఈవీఎంలు మొరాయిస్తున్నా, గంటల కొద్దీ ఎండల్లో బారులు తీరి నిలబడాల్సి వచ్చినా, ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడం విశేషం.
అయితే, పెరిగిన మహిళా ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలం అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైకాపా వైపు మహిళాలోకం మొగ్గు చూపిందా? అధికార పార్టీ టీడీపీ మీద సంతృప్తి వ్యక్తం చేసిందా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెరిగిన మహిళా ఓటింగ్ తమకే అనుకూలం అంటోంది వైకాపా. వారి ఓటింగ్ పెరగడంతోనే చంద్రబాబు నాయుడు ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారనీ, వడ్డీలేని రుణాలను తీసేశారన్న కోపంతోనే మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారనేది ఆ పార్టీ విశ్లేషణ.
టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పసుపు కుంకుమ పథకం మహిళలను పెద్ద ఎత్తున ఆకర్షించిందనీ, పండుగల్లో ఇచ్చే చంద్రన్న కానుకలపై కూడా తీవ్ర సంతృప్తి చెందారనీ, అందుకే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు మహిళలు వచ్చారనేది వారి విశ్లేషణ. అయితే, రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే… ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఓటెయ్యడానికి రాని సందర్భాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోటి, ఒకవేళ వారికి కోపం వస్తే… దాన్ని బయటకి వ్యక్తం చేస్తారనీ, అసంతృప్తిని వెంటనే బయటపెట్టేస్తారనీ, రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రంలోనూ అలాంటి వాతావరణం కనిపించలేదంటున్నారు. బారులు తీరిన మహిళల్లో ఆనందమే కనిపించిందని అంటున్నారు. ఈ ఎన్నికల తీర్పు మహిళాలోకం ఇచ్చే తీర్పుగానే చూడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.