ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉండి… శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఇండ్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి యేటా ఈ పెరుగుదల స్పష్టంగా కనపడుతోంది.
తాజాగా ప్రాప్ ఈక్విటీ సంస్థ విడుదల చేసిన గణంకాల ప్రకారం… ఏపీలో వైజాగ్, విజయవాడ నగరాల్లో కొత్త ఇండ్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఈ నగరాల్లో నివాసాలకు అనుగుణంగా నిర్మించే నిర్మాణాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
దేశంలోని మొత్తం 30 ద్వితీయశ్రేణి నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలను విశ్లేషించగా… ప్రతి నగరంలోనూ వృద్ధి కనపడిందని, గడిచిన 5 సంవత్సరాల్లో ప్రారంభ ధరలో 94శాతం వృద్ది ఉందని ప్రాప్ ఈక్విటీ సంస్థ విశ్లేషించింది.
అయితే, విశాఖ విజయవాడతో పోల్చితే గడిచిన 5 సంవత్సరాల్లో… గోవా, లుథియానా, లక్నో, ఇండోర్, ఆగ్రా, డెహ్రడూన్, భువనేశ్వర్, మంగళూరు, త్రివేండ్రంలలో కనీసం 50శాతం నుండి 90శాతం వరకు వృద్ది ఉంది. కానీ, వైజాగ్, విజయవాడలో కేవలం 10-11శాతం మాత్రమే పెరుగుదల ఉంది.
గడిచిన 5 సంవత్సరాల్లో ఏపీలో ఉన్న రాజకీయ అస్థిరత కారణంగానే పెరుగుదల కనపడటం లేదన్నది స్పష్టంగా కనపడుతోంది. దేశంలోని అన్ని నగరాల్లో రియల్, నిర్మాణ రంగాల్లో బూమ్ ఉన్నా ఈ రెండు నగరాల్లో స్తబ్ధత ఉంది.
కానీ, ఇప్పుడు ఉద్యోగ ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలతో పాటు… అమరావతిని ఏపీ రాజధానిగా నిర్మాణం, వైజాగ్ కు ఇండ్టస్రీయల్ కారిడార్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా వచ్చే ఐదేళ్లలో కనీసం55-70శాతం వృద్ది ఉండే అవకాశం ఉంది.