భారీ పరిశ్రమల్లో ముఖ్యంగా కెమికల్, ఫార్మా రంగాల్లో ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అవి మళ్ళీమళ్ళీ తలఎత్తకుండా ముందుగానే నివారించగలిగేలా రీసెర్చి జరగడం లేదు. 2011 నుంచి ఈ రెండు రంగాల్లో 35 వరకూ పెద్ద అగ్గిప్రమాదాలు జరిగాయి. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ సెజ్ లో (స్పెషల్ ఎకనామిక్ జోన్) జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టమేదీ జరగకపోయినా, 1997 లో హెపిసిఎల్ లో జరిగిన ప్రమాదం తీవ్రతకంటే ఏమాత్రం తక్కువ కాదు. ఆ అగ్నిప్రమాదంలో 60 మంది చనిపోయారు. (ప్రాణనష్టం మినహా) అంతే తీవ్రత గల ప్రమాదం మళ్ళీ తల ఎత్తిందంటే పారిశ్రామిక భద్రతలోగానీ, విద్యుత్ సరఫరాలో నష్టాలను అధిగమించడంలోగాని 20 ఏళ్ళుగా మనం ఒక్క ముందడుగు కూడా వెయ్యలేకపోయామని మరోసారి స్పష్టమైపోయింది.
మొక్కలనుంచి చమురు ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంలో దేశంలోనే అతి పెద్దసంస్ధగా పేరున్న బయోమాక్స్ సంస్ధ ఏటా ఐదులక్షల టన్నుల చమురుని ఉత్పత్తి చేస్తుంది. ఇలా తయారైన చమురును 2500 టన్నుల చొప్పున స్టోరేజి కెపాసిటీ వున్న ట్యాంకర్లలో వుంచుతారు. ఈ ప్రమాదంలో 12 ట్యాంకర్లు దగ్ధమైపోయాయి. వందకోట్ల రూపాయలకు మించి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతోంది.
విద్యుత్ షార్టు సర్కూటే కారణం గా భావిస్తున్న ఈ భారీ ప్రమాదం వల్ల వాయు కాలుష్యం ఏమేరకు జరిగిందో గుర్తించడానికి కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు శాంపిల్స్ సేకరించారు.
ముడివనరులను, చవుక మానవ శక్తిని ప్రపంచానికి అమ్ముకోవడమే నిరంతర అభివృద్ధి మంత్ర ప్రయోగమే దీక్షగా పాలన సాగిస్తున్న నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు సహా ప్రజానాయకులు ఈ జపంలో ముడివనరులను, చవుకమానవ శక్తిని ప్రపంచానికి అమ్మేసుకోవడమే మూలసూత్రమని గుర్తించరు. గుర్తించినా ఏమాత్రం పట్టించుకోరు. ప్రజలు మాత్రం అన్నిటినీ గమనిస్తారు. అందుకే తీరం పొడవునా ఓడరేవులు కడతామన్నా, కెమికల్, ఫార్మా కంపెనీలు పెట్టేస్తామన్నా అక్కడ సహజసిద్దంగా ప్రకృతిలో, నీటిలో మమేకమై జీవించే 14 లక్షల మత్స్యకారులకు ఆనందం కలగదు. పైగా కృత్రిమ అభివృద్ది మనకొద్దు ఆని ఉద్యమించడానికి ఇలాంటి ప్రమాదాలు కూడా ఊతమిస్తాయి.
అదే సమయంలో ఆర్ధిక సంస్కరణలు, రాయితీల నుంచి పుట్టే పరిశ్రమలకు మరిన్ని సెజ్ ల గురించి డిమాండు చేయడానికి కూడా ఇలాంటి ప్రమాదాలే ఊతమిస్తాయి. మానవవనరులతో పని లేని ఆటోమేషన్ వల్లే ప్రాణనష్టం లేదు కాబట్టి పరిశ్రమల్లో యాంత్రీకరణే తరుణోపాయమన్న వాదనకు బలమిస్తాయి.
సంఘటన తీవ్రతను అంకెల్లో చూపించే మీడియాకు మొత్తం సంఘటనను 100 కోట్ల రూపాయల నష్టం అని హైలైట్ చేస్తుంది. నిజానికి నష్టం ఏదీ వుండదు..ఇన్సూరెన్స్ సంస్ధలనుంచి పరిహారాలుగా పెద్దసంస్ధలకు షార్టు సర్క్యూట్ నష్టాలు పూడిపోతాయి.