ఢిల్లీ క్రికెట్అసోసియేషన్ వ్యవహారాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పై ఆరోపణలు చేసిన క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్‌ను బిజెపి నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీ అగ్రనాయకత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.
ఈ విషయంగా సీనియర్ నాయకులు అసంతృప్తితో వున్నారు. సస్పెన్షన్ విషయాన్ని ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఓ సారి సమావేశమై పార్టీ తీరును బహిరంగంగానే ఎండగట్టిన ఈ సీనియర్లు.. ఈసారి ఆచితూచి స్పందిస్తున్నారు. ఆజాద్ ఎపిసోడ్‌పై పార్టీ పెద్దలు ఎలాంటి ప్రకటన చేయకపోయినా… పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ త్వరలోనే తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కూడా కీర్తి ఆజాద్‌కే మద్దతుగా నిలిచారు. “నిజాయతీ గల నాయకుడ్ని పార్టీ వదులుకుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమా నటుడు బిజెపి నాయకుడు శత్రుఘ్నసిన్హా మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. డీడీసీఏ అవకతవకలను బయటపెట్టిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ను హీరోగా అభివర్ణించారు. ఇప్పటికైనా అరుణ్ జైట్లీ రాజీనామా చేసి అద్వానీ చూపిన బాటను అనుసరించాలని డిమాండ్ చేశారు. డీడీసీఏ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ జైట్లీ వాటిని రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ న్యాయస్థానాలను ఆశ్రయించి కాదని హితవు చెప్పారు. జైట్లీ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకున్న తరువాత మళ్లీ పదవి చేపట్టాలని, ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆయనకు అదే సలహా ఇచ్చారని పేర్కొన్నారు.
నిజాలు చెప్పడమే తానే చేసిన నేరమైతే.. ఎప్పటికీ నేరాలు చేస్తూనే ఉంటానంటూ కీర్తి ఆజాద్ మరింత ఘాటుగా స్పందించారు. డీడీసీఏ వ్యవహారంలో ప్రధానమంత్రి మోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా క్రికెట్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వదలి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.