అనుకొన్నదే అయ్యింది. మెల్ బోర్న్ టెస్ట్ లో భారత్ ఓడిపోయింది. ఏ దశలోనూ భారత బ్యాటర్లు పోటీ ఇవ్వలేకపోవడంతో ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సివచ్చింది. 5వ రోజు 340 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 184 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకోగలిగింది ఆసీస్. దాంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1 తేడాతో ఆసీస్ ముందు అడుగు వేసింది. దీంతో పాటు ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు కోసం తన అవకాశాల్ని మరింత మెరుగు పరుచుకొంది.
టీ బ్రేక్ సమయంలో భారత్ ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకొంటుందనిపించింది. ఎందుకంటే అప్పటికి కోల్పోయింది 3 వికెట్లు మాత్రమే. పంత్, జైస్వాల్ క్రీజ్‌లో ఉన్నారు. మరో 30 ఓవర్లు కాచుకొంటే మ్యాచ్‌ని డ్రా చేసుకోవొచ్చు. ఇలాంటి దశలో ఓ పేలవమైన షాట్ ఆడి ఔట్ అయ్యాడు పంత్. తొలి ఇన్నింగ్స్ లోనూ అర్ధం పర్ధం లేని షాట్ ఆడి వికెట్ పారేసుకొన్న పంత్ ఈసారి కూడా అదే తప్పు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరవాత భారత్ క్రమంగా వికెట్లు సమర్పించుకొంది. నిలకడగా ఆడుతున్న జైస్వాల్ థర్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. చివరికి భారత్ 155 పరుగులకు చాప చుట్టేసింది. ఫామ్ లో లేక సతమతమవుతున్న రోహిత్ (9) పరుగులకు ఔటై మరోసారి విమర్శల పాలయ్యాడు. కోహ్లీ కూడా పేలవమైన షాట్ తో పెవీలియన్ చేరాడు. జడేజా, నితిష్ రెడ్డి కాస్త నిలదొక్కుకొన్నా ఈ మ్యాచ్‌ని భారత్ డ్రా చేసేది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కాపాడుకోవాలంటే.. సిడ్నీలో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి తీరాల్సిందే.