మూడు రోజుల్లో ముగిసిన సిడ్నీ టెస్ట్ లో భారత్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా 6 వికెట్లతో ఘన విజయం సాధించి బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌ని కైవసం చేసుకోవడమే కాకుండా, వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ప్రవేశించింది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కడం మినహా.. భారత్ సంబరాలు చేసుకొనేందుకు ఏమీ లేకుండా పోయింది.
స్వింగ్‌కూ, సీమ్ కు అనుకూలించే ఈ పిచ్‌పై భారత్ కనీసం 200 పరుగుల లక్ష్యాన్నయినా ఆసీస్ ముందు ఉంచితే చాలనుకొన్నారు. కానీ.. కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. పంత్ (33 బంతుల్లో 61) ఒక్కడే ఆసీస్ బౌలింగ్ ని ఎదుర్కొని పరుగులు సాధించాడు. ఈరోజు ఉదయం ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మిగిలిన వికెట్లకు 16 పరుగులకే సమర్పించుకొంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బౌలింగ్ కు దిగకపోవడంతో ఆసీస్ పని మరింత సులభం అయ్యింది. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రసీద్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్ కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ప్రవేశించింది ఆసీస్. ఇది వరకే సౌత్ ఆఫ్రికా ఫైనల్ లో బెర్తు ఖాయం చేసుకొన్న సంగతి తెలిసిందే.