టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దాదాపు రెండు రోజుల ఆటలోనే నాలుగు ఇన్నింగ్స్ గల టెస్ట్ మ్యాచ్ ని నెగ్గింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ ని చిత్తూ చేసింది. ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా రెండు రోజులు ఆట రద్దయిన సంగతి తెలిసిందే.
మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసింది. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (8), గిల్ (6) తక్కువ స్కోర్స్ కే పెవిలియన్ చేరారు. యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29)తో దూకుడుగా ఆడారు.
ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను భారత్ గెలిచినట్లు అయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమ్ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
రెండు టెస్ట్ మ్యాచ్ లో భారత్ దూకుడు ఆట తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా ఐదు వరల్డ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. టెస్ట్ క్రికెట్ లో అత్యంగా వేగంగా టీమ్ 50, 100, 150, 200, 250 స్కోర్లు చేసిన జట్టుగా భారత్ అవతరించింది.