స్వదేశంలో భారతజట్టుకు తిరుగులేదన్నది విశ్లేషకుల మాట. ఇటీవలే బంగ్లాదేశ్ ని భారత్ తుక్కు తుక్కుగా ఓడించింది. అయితే… ఇప్పుడు న్యూజీలాండ్ చేతిలో ఘోరంగా దెబ్బతింది. బెంగళూరులో భారత్ – న్యూజీలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వర్షం కారణంగా తొలి రోజు టాస్ కూడా పడకుండానే ఆట రద్దు అయ్యింది. రెండో రోజు వర్షం లేకపోవడంతో ఆట మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్వదేశంలో భారత జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. భారత బ్యాటర్లలో పంత్ (20) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లంతా చేతులెత్తేశారు. న్యూజీలాండ్ బౌలర్ల ప్రతిభని తక్కువ అంచనా వేయకూడదు కానీ, భారత బ్యాటర్లలో చాలామంది చెత్త షాట్లకు అవుటయ్యారు.
జైస్వాల్ 13, రోహిత్ 2, మహ్మద్ సిరాజ్ 4 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ, సర్ఫ్రాజ్ ఖాన్, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ .. ఇలా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు తీశాడు. విలయమ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇన్నింగ్స్ కేవలం 31.2 ఓవర్లలోనే ముగియడం విశేషం. పిచ్ పేసర్లకు అనుకూలిస్తోంది. అయితే భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లని ఎంచుకొంది. బుమ్రా, సిరాజ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్లు. పేస్‌కు అనుకూలించే పిచ్ పై స్పిన్నర్లని ఎంచుకోవడం పెద్ద తప్పు. కేవలం 46 పరుగులే చేసిన భారత్ ఈ టెస్ట్ మ్యాచ్‌ని కాపాడుకోవడం దాదాపుగా అసాధ్యమే. వర్షం వల్ల.. డ్రా అయితే అంతకంటే కోరుకొనేది ఏం ఉండదు. ఈ మ్యాచ్‌ని వరుణుడే కాపాడాలి ఇక.