కేప్‌టౌన్ టెస్ట్ లో భారత్ విజయ పతాక ఎగరేసింది. దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 1-1 తేడాతో సిరీస్‌ని సమం చేసింది. ఈ టెస్ట్ కేవలం 2 (109 ఓవర్లు) రోజుల్లోనే ముగియడం విశేషం. అతి తక్కువ సమయంలో ముగిసిన టెస్ట్ గా… ఈ మ్యాచ్ రికార్డు పుటల్లోకి ఎక్కింది.
సిరాజ్ (6 వికెట్లు) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే. అనంతరం భారత్ 153 పరుగులకు ఆలౌటై 97 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 176 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి, భారత్ ముందు 79 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మార్క్రమ్ అద్భుత సెంచరీ (103 బంతుల్లో 106) సాధించాడు. లేదంటే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొనేదే. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ కేవలం 12 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొంది. జైస్వాల్ (28), రోహిత్ శర్మ (17 నాటౌట్) రాణించారు.