భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అయింది. ఎప్పటిలాగే దేశమంతా ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల్ని గుర్తు చేసుకుంటున్నాం. జెండా పండుగను జరుపుకుంటున్నారు. ఈ 78 ఏళ్లలో భారత్ నిస్సందేహంగా మంచి అభివృద్ధిని నమోదు చేసింది. మనం అందరికీ సలహాలిచ్చినట్లుగా ఇతరులతో పోల్చుకుని మనం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని బాధపడటం తప్పు. మనకున్న సామర్థ్యం మేరకు మనం అభివృద్ధి చెందామా లేదా అన్నది సమీక్షించుకోవడం మాత్రం అవసరం.
భారత్ కు ఉన్న వనరులు, సంపద, కష్టపడే తత్వం ఉన్న జనాభా, నైపుణ్యం ఉన్న మానవ వనరులతో పోలిస్తే మనం ఖచ్చితంగా అభివృద్ధిని ఆశించినంత స్థాయిలో.. మన సామర్థ్యానికి తగ్గట్లుగా సాధించలేదని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక మల్టీనేషనల్ కంపెనీల సృష్టిలో.. అభివృద్దిలో భారతీయుల పాత్ర ఉంది. చివరికి ఫేస్బుక్ అందరూ జకర్ బర్గ్ ఆలోచన అనుకుంటారు. కానీ అది ఓ భారతీయుడిది. ఆ విషయం గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడీ గూగుల్‌ను నడిపిస్తోంది భారతీయుడే.
సరైన సౌకర్యాలు అభివృద్ధి చేసకోవడంలో విఫలం కావడం .. మేథో వలస కారణంగా దేశం భారీగా నష్టపోయింది. ఇతర దేశాలు ఉపయోగించుకున్నాయి. ఇలాంటి లోపాలను సవరించుకోవడంలో దేశం అనుకున్నంతగా ముందడుగు వేయలేదు. పెరిగిపోతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలకు ఉన్న వెసులుబాటు పరిమితం. ఈ కారణంగా కూడా ప్రభుత్వాలను పూర్తిగా తప్పు పట్టలేం. ఓ రకంగా మన ప్రజాస్వామ్యం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. అదే చైనా తరహాలో నియంతృత్వంలోకి వెళ్లి ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెంది ఉండవచ్చేమో కానీ మన దేశం మాత్రం కల్లోలిత ప్రాంతంగా మారేది. ఎందుకంటే.. భారత ప్రజలకు పోరాట పటిమ ఉన్నవారు.. అణిచివేతను అసలు సహించరు. దానికి స్వాతంత్య పోరాటమే సాక్ష్యం.
సాధించలేకపోయిన దాని విషయంలో బాధపడటం కన్నా.. సాధించేందుకు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లడం సముచితం. ఇప్పుడు ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన వందేళ్లకు అంటే 2047 నాటికైనా దేశాన్ని అభివృద్ది చెందిన దేశంలో మార్చేందుకు కంకణం కట్టుకున్నాయి.
ప్రభుత్వాలు అంటే.. ప్రధానమంమత్రో.. ముఖ్యమంత్రో కాదు. ప్రభుత్వం అంటే ప్రజలు. ఆ ప్రజలంతా కలసి సంకల్పంతో ప్రయత్నిస్తేనే.. దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మనమంతా దేశాన్ని 2047 నాటికి అభివృద్ధిచెందిన దేశంగా మార్చేందుకు మన వంతుగా కృషి చేయాలి. దాని కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మనల్ని.. మన కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటే చాలు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తే దేశంలో అన్ని కుటుంబాలు బాగుపడతాయి. దేశం అభివృద్ధి చెందినట్లే. ఎందుకంటే దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులు !