తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా వరుసగా రెండవసారి కూడా గోల్కొండ కోటలోనే పతాకావిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, పలువురు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని త్వరలోనే విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభిరుద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.