దేశ 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విశాఖ సాగర తీరంలో ఘనంగా నిర్వహించింది. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ర్ట పోలీసులు, హోం గార్డులు, ఎన్.సి.సి. కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధుల బృందాలు బీచ్ రోడ్డులో పెరేడ్ చేసి ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఆకర్షణీయంగా తీర్చిద్దబడిన శకటాలు ప్రదర్శించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, పలువురు జిల్లా మంత్రులు, డిజిపి జెవి రాముడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖనగరంలో నిర్వహించడంతో నగర ప్రజలు కూడా చాలా సంతోషించారు. సాగరతీరంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారనే సంగతి తెలుసు కొని ప్రజలు భారీగా తరలివచ్చారు. నగర సందర్శనానికి వచ్చిన పర్యాటకులు కూడా ఈ వేడుకలను చూడటానికి తరలివచ్చారు.