భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు . ఇదేమి చిన్న సంఖ్య కాదు. మనకు ఉన్న అద్భుతమైన యువశక్తి, మానవ వనరులు.. సహజ వనరులు అన్నీ కలుపుకుని అభివృద్ది చెందిన దేశంగా మారడానికి అవసరమైన అన్నీ ఉన్న దేశం. పాలకుల చేతకాని తనమో.. ప్రజల ఏమరపాటు కారణమో కానీ.. దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం అన్నట్లుగానే ఉంది. ఇప్పటికి దేశంలో సగం మందికిపైగా జనాభాకు ప్రభుత్వం తిండి , తిప్పలు సాయం చేసి పెట్టాలి. ఇందు కోసం మిగతా సగం మంది దగ్గర అదనంగా వసూలు చేయాల్సిన పరిస్థితి.
నిజానికి అంత అవసరం లేదు. ఏ దేశం అయినా గట్టిగా నిలబడాలంటే.. ఆ దేశంలో ప్రజలందరూ… గట్టిగా నిలబడాలి. అలా ఉండాలంటే.. అందరికీ విద్య వైద్య, ఉపాధి సౌకర్యాల అందాలి. మన దేశంలో ఈ మూడు సమస్యల విషయంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కింది స్థాయి వారికి ఈ మూడు అందడం గగనమే. కానీ ప్రభుత్వాలు వీటిపై పెట్టే ఖర్చును ఎవరూ ఊహించలేరు. ఆ సొమ్మంతా ఏమవు తుందో తెలియదు. వీటి పేరుతో ప్రజలకు పదో పరకో పంచి పెట్టి అదే గొప్ప సంక్షేమం అనే నయా పాలకులు పుట్టుకొచ్చారు. అందుకే భవిష్యత్‌పై భయం ఏర్పడుతోంది.
దేశంలో ఉన్న కొంత మందిని కొట్టి.. కొంత మంది సోమరుల్ని పోషించడం మాననంత కాలం దేశం ముందడుగు వేయడం కష్టం. నిజంగా పనులు చేసుకోలేని వారికి సాయం చేయడం సంక్షేమం. కానీ ప్రతి ఒక్క ఓటు బ్యాంక్ కీ డబ్బులు పంచడం మాత్రం… దేశానికి పట్టిన దౌర్భాగ్య. ప్రస్తుతం దేశంలో ఇదే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్ల దేశం ముందుకెళ్లడం చిన్న విషయం కాదు.
ఈ 76 ఏళ్లలో దేశం ముందుకెళ్లలేదా .. అంటే.. ఒకప్పుడు మంచి నీళ్ల కోసం.. కరెంట్ కోసం…. ఫోన్ సౌకర్యం కోసం కూడా ప్రజలు తంటాలు పడేవాళ్లు. అవన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రపంచం సాధిస్తున్న అభివృద్ధితో పోలిస్తే మనది ఎంత అని పోల్చుకుంటే నిరాశపడక తప్పదు. 140 కోట్ల మంది జనాభాతో ఎదగడం కష్టమనే వాదనను పక్కన పెట్టి అందర్నీ వర్క్ ఫోర్స్ గా మార్చుకుని అభిృద్ధి చెందడం అసలైన లక్ష్యం. ప్రజలు ఈ దిశగా చైతన్యవంతులైతే పాలకులు కూడా మారక తప్పదు. ఆ మార్పు రావాలని ఆశిద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.