రాంచీలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉన్నాయి..! ఈ రాజధాని ఎంత అభివృద్ధి చెందింది… ? రాయ్‌పూర్ లోనూ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉన్నాయి..! అ సిటీ ఎంత మందికి తెలుసు..? భోపాల్ అతి పెద్ద రాష్ట్రానికి రాజధాని..! అభివృద్ధిలో విశాఖ స్థాయిలో అయినా ఉందా..? ఇలా చెప్పుకుంటే… దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులు… కేవలం పరిపాలనాపరమైన కేంద్రాలే. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కార్యకలాపాలకే పరిమితం. ఇప్పటికి పలు రాజధానుల్లో వ్యాపార, పారిశ్రామిక ప్రగతి లేదు.
పాలనను వికేంద్రీకరించడమే అభివృద్ది అంటున్న రాజకీయ పార్టీలు..!
పాలన వికేంద్రీకరణ వేరు.. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. రాష్ట్రంలో ఉన్న ప్లస్ పాయింట్లను మార్కెట్ చేసి.. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారిని ఆకర్షించి.. వారి పెట్టుబడులతో రాష్ట్రాన్ని నలువైపులా అభివృద్ధి చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ. అదే సమయంలో.. ప్రభుత్వం తరపున నిధులు వచ్చించి.. అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు పెంచడం.. అభివృద్ధి వికేంద్రీకరణ. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. అభివృద్దిని అంతా అమరావతిలోనే కేంద్రీకరించిందని… ఇతర రాజకీయ పార్టీలు ఓ రేంజ్లో ప్రచారం చేశాయి. కానీ.. నిజానికి అమరావతిలో కన్నా.. పరిశ్రమలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం గణాంకాల ద్వారా అసెంబ్లీలోనే వెల్లడించింది.
సీమలో తయారీ రంగం.. ఉత్తరాంధ్రలో సేవల రంగం కేంద్రీకృతం..!
గత ఐదేళ్ల కాలంలో.. రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడులు.. అభివృద్ధి అవకాశాలు వచ్చాయనేది… కళ్ల ముందు కనిపించిన నిజం. చిత్తూరు జిల్లా శ్రీసిటీకి గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత చిత్తూరు పారిశ్రామిక ప్రగతి లెక్కలు తీస్తే.. గత యాభై ఏళ్లలో రానన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇక అనంతపురంలో.. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది. పదమూడు వేల కోట్ల పెట్టుబడితో కియా కార్ల పరిశ్రమ వచ్చింది. కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమవడమే… కాదు.. తంగడంచలో మెగాసీడ్ పార్క్ కూడా నిర్మాణం ప్రారంభించారు. సీమలో అనేక చోట్ల సోలార్ ప్రాజెక్టులువచ్చాయి. ఇలా చెప్పుకుటూ పోతే.. తయారీ రంగాన్ని గత ప్రభుత్వం రాయలసీమలో కేంద్రీకరించింది. ఉత్తరాంధ్రకు ఉన్న సానుకూలతలు.. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా.. సేవల రంగాన్ని… గత ఏపీ సర్కార్ ప్రోత్సహించింది. హైదరాబాద్‌కు మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత.. ఇతర ఐటీ కంపెనీలన్నీ.. ఎలా క్యూకట్టాయో.. అలా ఐటీ, ఫిన్ టెక్, బ్లాక్ చెయిన్ వంటి రంగాల్లో దిగ్గజ కంపెనీలను గత ఏపీ సర్కార్ ఆకర్షించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ‘గూగుల్ ఎక్స్, కండ్యుయంట్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కాపులుప్పాడలో 70వేల కోట్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆదాని గ్రూప్ ఒప్పందం చేసుకుంది. లూలూ గ్రూప్ సహా.. పలు సంస్థలు పెట్టుబడులతో వచ్చాయి. ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ సేవల రంగాన్ని…గత ప్రభుత్వం.. ఉత్తరాంధ్రలో కేంద్రీకరించింది.
సెక్రటేరియట్ ఉంటే చాలా.. పరిశ్రమలు అక్కర్లేదా..?
చంద్రబాబు హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారన్న ప్రచారం జరగడం.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి విషయంలో ఆయన వేసుకున్న ప్రణాళికలు… తన తెలివితేటలు, కష్టంతో చేసిన ప్రయత్నాలతో.. నిజంగానే ఓ అద్భుత నగరం ఆవిష్కరించబోతోందని దాదాపుగా అందరూ నమ్మేశారు. హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిన తర్వాత ఒక్కచోటే .. డెవలప్ చేశారని విమర్శలు ప్రారంభించిన రాజకీయం.. అమరావతి విషయంలో మాత్రం.. ఇంకా పునాదులు పడక ముందే పురివిప్పుకుంది. ఫలితంగా..అది.. ఒక ప్రాంతానిది.. ఒక్క సామాజికవర్గానిది అంటూ… ప్రచారం చేసి.. ఇతరుల్లో వ్యతిరేకత పెంచేశారు. మాకేంటి.. అన్న చర్చను ఇతర చోట్ల లేవనెత్తేలా చేశారు. అభివృద్ధి అనేదానికి … రాజకీయ పార్టీలు చూసే కోణం… అవి చేసే ప్రచాాన్ని బట్టి అర్థాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి అంటే.. ఏపీలో రాజధాని మాత్రమే. రాజధానిలో ఉంటే.. వ్యవస్థలు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను మూడు ప్రాంతాలకు పంచి గొప్ప అభివృద్ధిని చూపిస్తున్నామని చెప్పబోతున్నారు. వాటి వల్ల ఆయా ప్రాంతాల్లో ఎంతెంత అభివృద్ధి జరుగుందనేది.. ముందు ముందు తేలుతుంది.