బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రిషి సునఖ్ అనే వ్యక్తి పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి , సుధామూర్తిల అల్లుడు. వేరే దేశానికి ప్రధానమంత్రి తర్వాత అంత గొప్ప పదవిని పొందబోతున్న ఆయనకు.. భారతదేశం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్లకే అంతెత్తు ఎదిగిన ఆయన ఎలా సాధించారనేది.. చాలా మందికి స్ఫూర్తి. అది బయట వాళ్లకే. ఇండియా వాళ్లకు మాత్రం ముందుగా ఆయనలో కావాల్సింది .. ఆయన కులం. గూగుల్లో రిషి సునఖ్ కులం ఏమిటంటూ.. సెర్చ్ చేశారు ఇండియన్స్. ఆ వివరాలను గూగుల్ బయట పెట్టింది.
బ్రిటన్లో ప్రధాని పదవి తర్వాత ఆర్థిక మంత్రి పదవి అంత కీలకం. బ్రెగ్జిట్ తర్వాత అది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కొంత మంది ఆ పదవిని చేపట్టడానికి కూడా సిద్ధపడలేదు. అలాంటిది సవాల్ తీసుకునేందుకు రిషి బ్రిటన్ ఆర్థిక మంత్రి అవుతుంటే.. అతని కులం ఏమిటా అని గూగుల్ చేస్తున్నారు భారతీయ నెటిజన్లు. రిషి సునఖ్ ఏం సాధించాడన్న దాని కన్నా.. అతని కులం ఏంటనేదే భారతీయులకు ముఖ్యమైనదిగా కనిపిస్తుందని గూగుల్ వ్యాఖ్యానించించింది.ఈ విషయంపై రిషి సునఖ్ కూడా స్పందించారు. తాను హిందూనే అయినప్పటికీ.. చర్చికు కూడా వెళతానని ప్రకటించారు.
భారతీయుల్లో పెరిగిపోతున్న కులభావనను రాజకీయ పార్టీలు.. అంతే బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే.. రాజకీయాల కోసం పెంచి పోషిస్తున్నాయి. ఓ కులంపై ద్వేషం..మరో కులంపై… విద్వేషం.. తమ కులంపై సానుకూలత చూపి ప్రజల్ని విడగొట్టేస్తున్నాయి. ఆ పరిణామం.. ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీస్తోంది. దానికి రిషి సునఖ్ వ్యవహారామే ఉదాహరణ.