ఇండియా కూటమి ఎంత హైప్ క్రియేట్ చేసిందో అంతగా డీలా పడిపోతోంది. కూటమిని గట్టిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ మధ్యలోనే మారిపోయారు. ఆయన బీజేపీ పంచన చేరిపోయారు. మరో కీలక నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కూటమిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్‌తో సీట్ల పంచుకునేదే లేదు అని తేల్చి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ కు దూరంగా ఉండాలనుకుటోంది. ఇలా ఒకటి తరవాత ఒకటి బయటకు వెళ్లిపోతూ.. లోపల్లోల కలహాలకు దిగడంతో కూటమి ప్రభావం తగ్గిపోతోంది.
కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే 2029లో తాము బలపడవచ్చనే అభిప్రాయంతో మమతాబెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్‌కుమార్ వంటి నేతలు ఆలోచనలు చేస్తున్నారు. అపుడు బీజేపీకి తామే ప్రత్యామ్నాయంగా మారుతామనే భావనతో ఉన్నారు. అందుకే ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి రావాలని వారు పెద్దగా అనుకోవడం లేదు. ప్రస్తుత పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సిందే. ఇదే జరిగితే కాంగ్రెస్‌పై ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా పోతుంది. భారత్ జోడో యాత్రకు వచ్చినంత స్పందన భారత్ జోడో న్యాయ్ యాత్రకు రావడం లేదన్న గుసగుసలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ రాంగ్ టైమ్‌లో యాత్ర చేస్తున్నారన్నది కొందరి వాదన. దీనిపై ఎవరి వాదనలు వాళ్లకున్నా…మరి కొద్ది రోజుల్లోనే కూటమి మొత్తం కూలిపోయే ప్రమాదమైతే కనిపిస్తోంది.
దీనంతటికి బీజేపీ వ్యూహమే కారణం. మోడీ, షా లు కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు కలసి కట్టుగా పోటీ చేయకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి ఉండే పార్టీలు దర్యాప్తు సంస్థల ద్వారా వల వేస్తున్నారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడితే.. పోరాటం అనేది చేయవచ్చు. ఫలితం సంగతి తర్వాత. కానీ అలాంటి పరిస్థితి రానీయకుండా బీజేపీ కూటమిని వెంటాడుతోంది