భారతీయ జనతా పార్టీకి తిరుగులేని బలం ఇండీ కూటమే,. బీజేపీని ఎదుర్కొందామని అందరూ చేతులు కలుపుతారు. కానీ బీజేపీ గురించి మర్చిపోయి తమలో తాము కలహించుకుంటారు. ఎవరికి వారు తమ కూటమి పార్టీ కంటే తామే ఎక్కువ అని ఊహించుకుని .. ఇతర పార్టీల్ని కించపరుస్తూంటారు. చివరికి అది వారు ఓడిపోవడానికి కూటమిని ఓడించడానికి ఓ కారణంగా చేసుకుంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి కాస్త ఐక్యంగా ఉంది. ఎవరికి వారు అయినా సీట్లు సర్దుబాటు చేసుకుని పోరాడారు. కొన్ని చోట్ల వర్కవుట్ అయింది. మరికొన్ని చోట్ల కాలేదు. ఆ విషయం పక్కన పెడితే.. ఆ ఐక్యత కొనసాగించడంలో విఫలమయ్యారు. హర్యానాలో ఆప్ తమకు సగం సీట్లు కావాలని పట్టుబట్టింది. అన్ని సీట్లు ఇవ్వలేక కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ఆప్ పోటీ చేసి చీల్చిన రెండు, మూడు శాతం ఓట్లతో గెలవాల్సిన హర్యానాలో గెలుపు కాంగ్రెస్ చేజారిపోయింది. హర్యానాలో సీట్లివ్వలేదు కాబట్టి ఢిల్లీలో కాంగ్రెస్ ను కలుపుకునేది లేదని కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చిన వెంటే ప్రకటించి తన రాజకీయం తాను చేసుకున్నారు.
ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం ఓట్ల వరకూ సాధించి.. ఆప్ పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంటే రెండు చోట్ల ఇండీ కూటమిని ఆ కూటమి పార్టీలే ఓడించుకున్నాయి. బీజేపీకి విజయాన్ని సాధించి పెట్టాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ కలిసి కాంగ్రెస్ పార్టీ లేని కూటమిని సృష్టించుకుని రాజకీయాలు చేస్తారట. అలా కూడా ఆలోచించారంటే..ఇక ఆ కూటమి గెలుపుదాకా వెళ్తుందని ఎవరూ అనుకోలేరు. ఇప్పుడు అదే జరిగింది.