విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ పఠాన్ కోట్ దాడికి కుట్రపన్నిన జైష్ ఏ మొహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ తో బాటు భారత్ పై దాడులకు కుట్రలు పన్నుతున్న మొత్తం 11 మంది ఉగ్రవాదుల పేర్లను సాంక్షన్స్ కమిటీ యొక్క ‘మోస్ట్ వాంటడ్ ఉగ్రవాదుల జాబితా’లో చేర్చవలసిందిగా ఫిబ్రవరి 18న ఒక లేఖ ద్వారా ఐక్యరాజ్యసమితిని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం దానిపై ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకోబోతోంది కనుక దానికి సమర్పించిన ఆ జాబితాలో గల మిగిలినఉగ్రవాదుల పేర్లను ఇప్పుడే బయటపెట్టలేమని ఆమె పార్లమెంటుకి తెలిపారు.
దీని గురించి అంతకు ముందే స్పందించిన విదేశీ వ్యహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ “ఆ జాబితాలో జైష్ ఏ మహమ్మద్ సంస్థ పేరుంది కానీ దాని అధినేత మసూద్ అజహర్ పేరు లేకపోవడమే చాలా విచిత్రంగా ఉంది” అని ట్వీట్ చేసారు.
ఒకవేళ ఆ జాబితాలో మసూద్ అజహర్ పేరును చేర్చడానికి ఐక్యరాజ్యసమితి అంగీకరించినట్లయితే అతనిని కంటికి రెప్పలా కాపాడుకొంటున్న పాకిస్తాన్ కి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అతను స్వయంగా భారత్ పై జరిగిన దాడులకు తమ సంస్థే బాధ్యత వహిస్తోందని గొప్పగా ప్రకటించుకొన్నాడు. అంతే కాదు మున్ముందు పఠాన్ కోట్ కంటే చాలా పెద్ద స్థాయిలో దాడులు చేస్తామని కూడా ప్రకటించాడు. పఠాన్ కోట్ దాడి జరిగిన తరువాత అతనిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది కనుక ఇప్పుడు అతను తమ వద్ద లేడని బుకాయించలేదు. కానీ మరీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయితే అతనిని విడిచిపెట్టేసి, తప్పించుకొని పారిపోయాడని అబద్దం చెపుతుందేమో?