భారత్-పాక్ మధ్య ఈనెల 19న కోల్ కతాలో ని ఈడెన్ గార్డెన్స్ లో జరుగవలసిన టి20 క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వస్తున్న తమ ఆటగాళ్ళకు పూర్తి భద్రత కల్పిస్తామని భారత్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పాకిస్తాన్ హోం మంత్రి నిసార్ ఆలి ఖాన్ కోరారు. భారత్ లో కొన్ని వర్గాలు ఈ మ్యాచ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా తమ ఆటగాళ్ళ భద్రత విషయంలో తాము చాలా ఆందోళన చెందుతున్నామని, వారి భద్రతకు పూర్తి బాధ్యత తమదేనని భారత్ లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే తమ ఆటగాళ్ళను మ్యాచ్ ఆడేందుకు భారత్ కి పంపిస్తామని ఆయన చెప్పారు.
పాక్ ఆందోళన సహేతుకమే కానీ అందుకోసం భారత ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరడం చాలా అతిగా ఉంటే, అందుకు ఆగ్రహించవలసిన భారత నేతలు చాలా మంది పాక్ ఆటగాళ్ళ భద్రత బాధ్యత మాదంటే కాదు మాదేనని పోటీలు పడుతూ హామీలు ఇస్తున్నారు. వారి భద్రతకు పూర్తి బాధ్యత మాదేనని కనుక పాక్ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి పంపమని కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీ.సి.సి.ఐ. సభ్యుడు రాజీవ్ శుక్లా తదితరులు పాకిస్తాన్ న్ని ప్రాధేయపడుతుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. పాక్ ఆటగాళ్ళను భారత్ లో ఆడేందుకు ఆహ్వానిస్తున్నపుడు వారి రక్షణ బాధ్యత తమదే అవుతుందని కనుక దాని కోసం మళ్ళీ లిఖితపూర్వకంగా హామీ కోరడం సబబు కాదని వారు పాకిస్తాన్ కి విజ్ఞప్తి చేసారు.
పాక్ లో శిక్షణ, సహకారం పొందిన ఉగ్రవాదులు పఠాన్ కోట్ పై దాడులు చేసినపుడువారిని ఎదుర్కొన్న భారత జవాన్ల రక్తపు మరకలు ఇంకా ఆరనే లేదు. ఆ ఉగ్రవాదుల దాడిలో తమ భర్తలను, తండ్రులను, కొడుకులను, అన్నదమ్ములను కోల్పోయినవారి కుటుంబాలు ఇంకా శోకిస్తూనే ఉన్నాయి. తమ జీవితాలను చిద్రంచేసిన ఆ ముష్కర మూకలను పట్టుకొని దండించి తమకు న్యాయం చేయమని కోరుతుంటే, పాక్ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోయినా అందుకు మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం కోపం రావడం లేదు. పైగా వారితోనే కికెట్ ఆడటానికి సిద్దం అయిపోయింది. పఠాన్ కోట్ దాడి తరువాత కొంచెం హడావుడి చేసిన భారత్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. భారత ప్రభుత్వానికే దానిపై ఆసక్తికోల్పోయినప్పుడు ఇంకా పాక్ ఎందుకు ఆసక్తి చూపిస్తుంది?
మూడు నెలల క్రితం పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఇప్పుడు అదే పాకిస్తాన్ ముందు దాని ఆటగాళ్ళను పంపమని మోకరిల్లుతోంది. అసలు పఠాన్ కోట్ దాడులకు నిరసనగా భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసుకొన్నప్పుడు, భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ కోసం ఎందుకు మోడీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో అర్ధం కాదు. పైగా పాక్ తన ఆటగాళ్ళను భారత్ పంపడానికి ఆంక్షలు పెడుతుంటే దాని ముందు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సహా అందరూ అంతగా మోకరిల్లిపోయి బ్రతిమాలుకోవడం చాలా విస్మయం కలిగిస్తోంది.
పాక్ తో మ్యాచ్ ఆడకపోతే భారత్ పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయన్నట్లుంది భారత్ నేతల స్పందన. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఎక్కడయినా మరోసారి దాడులు జరిగితే లేదా బాంబులు పేలితే అప్పుడు వీరందరూ ఏవిధంగా స్పందిస్తారో? అప్పుడు కూడా పాక్ ఆటగాళ్ళని పంపమని ప్రాధేయపడతారో లేక పాక్ ఆటగాళ్లతో వేరే దేశంలో మ్యాచ్ ఆడుకోవడానికి సిద్దపడతారో? పాక్ తో క్రికెట్ ఆడుకోవడానికి భారత్ మరీ ఇంత దిగజారి ఆ దేశం ముందు మోకరిల్లడం జాతీయవాదులు ఎవరూ జీర్ణించుకోలేరు కానీ జాతీయవాదానికి పేటెంట్ హక్కులు తమకే ఉన్నాయని చెప్పుకొనే మోడీ ప్రభుత్వం పాక్ ముందు మోకరిల్లుతోంది.