భారత్ యుద్ధం చేయాలనుకోవడం లేదు. కానీ ఉగ్రవాద శిబిరాలను మాత్రం వదలాలని అనుకోవడం లేదు. అయితే దూకుడుగా.. ఆవేశంగా ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. చాలా పక్కాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజానికి ముందే చెబుతున్నారు. ఉగ్రవాద బాధిత దేశంగా.. తమ పై మరోసారి అలాంటి దాడులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికి వందదేశాలకుపైగా ప్రతినిధులకు భారత ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చిందని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది.
పీవోకేలో ఉగ్రవాద శిబిరాలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచే…కశ్మీర్ లో ఉగ్రదాడులకు కుట్రలకు జరుగుతున్నాయి. ఇటీవల హమాస్ కు చెందిన వారు కూడా వచ్చి పాక్ సైన్యం ప్రేరేపిత లష్కరే ఉగ్రవాదులతో చర్చలు జరిపారని వివరాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో భారత్ పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటినీ మార్క్ చేసింది. అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి.. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద ప్రోత్సాహం గురించి పూర్తి సాక్ష్యాలను సేకరించింది. వాటిని ప్రధాన దేశాలకు అందిస్తోంది.
పీవోకేలో దాడులు తప్పనిసరి !
ఉగ్రవాదుల్ని అంతం చేయాలంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు చేయక తప్పదని భారత్ వాదిస్తోంది. తాము ఆ పని చేయబోతున్నామని ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయవద్దని..అలా చేయడం ఉగ్రవాదుల్ని సమర్థించడమే అవుతుందన్న సంకేతాలను భారత ప్రభుత్వం ఇతర దేశాలకు పంపుతోంది. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ కు సపోర్టు చేసే అవకాశం ఉంది. అందుకే.. అలా చేస్తే.. ఉగ్రవాదుల్ని సమర్థించడమేనని చైనా విధానాన్ని భారత్ ప్రపంచం ముందు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
సర్వసన్నద్ధంగా సైన్యం
ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేయడం ఖాయం కావడంతో ఉన్న పళంగా వారిని పీవోకే నుంచి ఖాళీ చేయించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పాకిస్తాన్ సైన్యం వారిని తొందరపెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ భూభాగంపై దాడి చేసినా.. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే.. ప్రపంచం మద్దతు భారత్ కే ఉంటుందని పాకిస్తాన్ కూ తెలుసు. అందుకే ఉగ్రవాదుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి.. ఆ ఉగ్రవాదానికే బలి అవుతున్నా.. పాకిస్తాన్ తీరు మాత్రం మారడం లేదు.