టెస్టు సిరీస్ విజయం, అందులోనూ పరాయి గడ్డపై, అదీ.. ఆసీన్ లాంటి బలమైన జట్టుపై – ఏ జట్టుకైనా ఇంతకంటే గొప్ప కల ఏముంటుంది? ఆ కలని నిజం చేసింది భారత క్రికెట్ జట్టు. ఆసీస్ పై 2-1 తేడాతో టెస్టు సిరీస్ విజయాన్ని సాధించి.. గబ్బా మైదానంలో భారత పతాకాన్ని రెప రెపలాడించింది.
భారత్ గెలవాలంటే.. చివరి రోజున 324 పరుగులు చేయాలి. చివరి రోజున గబ్బా పిచ్ పేసర్లకు స్వర్గధామం. అలాంటి పిచ్ పై.. కోహ్లీ అండలేని భారత జట్టు.. ఆసీస్‌ని చిత్తు చేసింది. మూడు వికెట్ల తేడాతో విజయ పతాక ఎగరేసింది. శుభ్‌మన్ గిల్ (91), రిషబ్ పంత్(89 నాటౌట్) పుజారా (56) రాణించడంతో.. 328 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించగలిగింది. ఓ దశలో.. మ్యాచ్ డ్రా అవుతుందేమో అనిపించింది. భారత్ ఈ మ్యాచ్‌ని కాపాడుకోవడం కష్టం అనిపించింది. అలాంటి దశలో.. శుభ్‌మన్ గిల్… బ్యాట్ ఝులిపించి వేగంగా పరుగులు సాధించాడు. తనకి పుజారా చక్కటి తోడ్పాటు అందించాడు. పిచ్‌లో పాతుకుపోయి.. అబేధ్యమైన డిఫెన్స్ తో ఆసీస్ బౌలర్లకు విసుగుపుట్టించాడు. గిల్, పుజారా అవుట్ అయినా… పంత్ రూపంలో భారత్‌కు ఆపద్భాంధవుడు దొరికాడు. పంత్ తన సహజసిద్ధమైన ఆట ఆడడానికి టైమ్ తీసుకున్నా.. ఒక్కసారి కుదురుకున్నాక.. ఆసీస్ బౌలర్ల భరతం పట్టాడు. చివర్లో వేగంగా పరుగులు కావల్సిన దశలో.. వాషింగ్టన్ సుందర్ నుంచి పంత్ కి తోడ్పాటు అందింది. ఇద్దరూ వన్డే మ్యాచ్‌ని తలపిస్తూ.. బ్యాటింగ్ చేశారు. సుందర్ అవుటైనా, పంత్ కంగారు పడకుండా.. భారత్ ని విజయతీరాలకు చేర్చాడు. గబ్బా స్టేడియంలో ఇప్పటి వరకూ.. ఆసీస్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాంటి జట్టుకు భారత్ ఓటమి రుచి చూపించినట్టైంది.