టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ కొన్ని `డ్రా`లు గెలుపంత కిక్ ఇస్తాయి. సిడ్నీ టెస్ట్ లో అలాంటి గెలుపు సొంతం చేసుకుంది భారత్. ఓటమి కోరల్లోంచి బయట పడి… అసాధారణమైన బ్యాటింగ్ తో… టెస్ట్ డ్రా చేసుకుంది. రిషబ్ పంత్(97) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు.. పుజారా(77) రాణించడంతో.. ఓ దశలో 407 పరుగుల లక్ష్యాన్ని సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. కానీ.. వెనువెంటనే పంత్, పుజారా ఔటవ్వడంతో… భారత్ కి ఓటమి భయం ఎదురైంది. ఈ దశలో విహారి(23 నాటౌట్), అశ్విన్(39 నాటౌట్) అద్భుతమైన డిఫెన్స్‌తో.. ఓటమి బారీ నుంచి కాపాడారు. ఆరో వికెట్‌కు ఏకంగా 258 బంతులాడి 62 పరుగులు జోడించారు. విహారి 161 బంతులాడి 23 పరుగులు చేశాడు. అశ్విన్ 128 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
అస్ట్రేలియా బౌలర్లు ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించారు. పలుమార్లు ఆసీస్ బౌలర్ల బంతులు.. అశ్విన్ ని గాయపరిచాయి కూడా. కానీ గాయాల్ని సైతం లెక్క చేయకుండా.. అశ్విన్ బ్యాటింగ్ కొనసాగించాడు. పలుమార్లు క్యాచ్‌లు విడిచిపెట్టడం.. భారత్ కు కలిసొచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. ఈ డ్రాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో రెండు టీమ్స్ సమవుజ్జీలుగా ఉన్నాయి. 1979 తర్వాత టీమిండియా చివరి ఇన్నింగ్స్‌లో ఇన్ని ఓవర్ల పాటు ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడం ఇదే తొలిసారి.