పాకిస్తాన్ తో పోలిస్తే బంగ్లాదేశ్ మన దేశంతో చాలా సఖ్యతగా ఉన్నాట్లే చెప్పుకోవచ్చును. భారత్-బంగ్లాదేశ్ మధ్య చిన్న చిన్న సమస్యలున్నాయి కానీ పాకిస్తాన్ లాగ అది భారత్ కి పెద్ద ఉగ్రసమస్యగా ఎన్నడూ లేదు. పైగా పాకిస్తాన్ తో పోలిస్తే బంగ్లాదేశ్ లో చాలా పారిశ్రామికాభివృద్ధి జరగిందని చెప్పవచ్చును. ఆ దేశానికి కూడా అంతర్గతంగా అనేక సమస్యలు, సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ అది కూడా భారత్ లాగే అభివృద్ధి కోసం పరితపిస్తుంటుంది. ఆ కారణంగానే ఆ దేశంతో భారత్ కి సత్సంబంధాలు సాధ్యమయ్యాయని చెప్పవచ్చును.
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగానే ఆ దేశంతో చిరకాలంగా ఉన్న సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోగలిగారు. ఇరు దేశాల సరిహద్దుల వద్ద తమ అధీనంలో ఉన్న కొంత భూభాగాలని పరస్పరం మార్పిడి చేసుకోవడం ఒక చారిత్రిక ఒప్పందమే.
మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇరు దేశాలు విద్యుత్, ఇంటర్నెట్ సరఫరాకి ఒప్పందం చేసుకొన్నాయి. బంగ్లాదేశ్ కి అతి సమీపంలో ఉన్న త్రిపురలోని పలటనా అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి బంగ్లాదేశ్ లోని కొమిల్ల అనే పట్టణానికి 100మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేయడానికి, అలాగే బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ నుంచి త్రిపురకు 10జిబి వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ప్రాజెక్టులను భారత ప్రధాని నరేంద్ర మోడి డిల్లీ నుంచి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డాకా నుంచి నిన్న ప్రారంభించారు.
భారత్, బంగ్లాదేశ్ రెండూ దేశాలు ఇప్పటికే రోడ్డు, జల, ఆకాశ మార్గాల ద్వారా కనెక్ట్ అయ్యాయిని, ఇప్పుడు సమాచార వ్యవస్థ ద్వారా కూడా కనెక్ట్ అవడం తనకి చాలా ఆనందం కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. ఇరు దేశాల మధ్య భౌగోళికంగా, ద్వైపాక్షికంగా సంబంధాలు బలపడటమే కాకుండా మేధోపరంగా ఇటువంటి మంచి సంబంధాలు కలిగి ఉండటం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు.
వారి వీడియో కాన్ఫెరెన్స్ లో భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కూడా పాల్గొన్నారు.