భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ అనగానే… వార్ వన్ సైడ్ అయిపోతుందనుకొన్నారంతా. కానీ.. బంగ్లా పులులు భారత్ ని ఒణికించాయి. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో… చివరి వరకూ పోరాడాయి. చివరకి భారత్ 5 పరుగుల తేడాతో ఓడించి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకొంది. ఈ విజయంలో వరుణుడి పాత్ర కూడా ఉంది. 185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్లు విజృంభిస్తున్న వేళ… వర్షం ముంచుకొచ్చింది. ఆ సమయానికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం… బంగ్లాదే గెలుపు. కానీ వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. 16 ఓవర్లలో 151 పరుగుల లక్షంగా కుదించారు. ఆట తిరిగి ప్రారంభమైన తరవాత బంగ్లా వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 20 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో అక్షర్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. అయినా సరే.. ఆ ఓవర్లో 14 పరుగులు పిండుకొంది బంగ్లా టీమ్.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ (44 బంతుల్లో 64) మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకొన్నాడు. సూర్య కుమార్ (30) వేగంగా పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ దాస్ (27 బంతుల్లోలమ 60) భారత బౌలర్లని ఓ ఆట ఆడుకొన్నాడు. ఓ దశలో బంగ్లా సునాయాసంగా విజయాన్ని సాధిస్తుందనిపించింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు. బంగ్లా వడి వడిగా వికెట్లు కోల్పోవడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ వెళ్లిపోయింది. ఈ విజయంతో.. గ్రూప్ బిలో భారత జట్టు అగ్ర స్థానంలో నిలిచింది. తన చివరి సూపర్ 12 మ్యాచ్లో జింబాంబ్వేతో తలపడనుంది భారత్.