న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్ లో సభ్యత్వం కోసం ప్రయత్నించి విఫలమైన భారత్ కి, రెండు రోజుల వ్యవదిలోనే మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (ఎం.టి.సి.ఆర్.)లో సభ్య దేశంగా ప్రవేశం లభించింది. ఎం.టి.సి.ఆర్. మొత్తం 34 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారత్ తో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య 35కి చేరింది. దీనిలో చైనా సభ్యదేశం కాదు. కనుక భారత్ ప్రవేశాన్ని అడ్డుకోలేకపోయింది. ఈ ఎం.టి.సి.ఆర్. సభ్యత్వం కోసం భారత్ 2015లోనే ప్రయత్నించింది. కానీ అప్పుడు ఇటలీ అడ్డుపడింది. తమ దేశానికి చెందిన ఇద్దరు నావికులని భారత్ విడిచిపెట్టడంతో ఎం.టి.సి.ఆర్.లో చేరేందుకు ఇటలీ అభ్యంతరం చెప్పకపోవడంతో భారత్ కి సభ్యత్వం లభించింది.
ఫ్రాన్స్ మరియు నెదర్ ల్యాండ్ రాయబారుల సమక్షంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జయశంకర్ సోమవారం ఉదయం సంబంధిత పత్రాలపై సంతకాలు చేయడంతో భారత్ కూడా ఎం.టి.సి.ఆర్.లో సభ్యదేశంగా మారింది. భారత్ ని సభ్యదేశంగా చేర్చుకొన్నందుకు మిగిలిన సభ్యదేశాలకి కృతజ్ఞతలు తెలిపారు.
- ఎం.టి.సి.ఆర్. ఏర్పాటు ఉద్దేశ్యం ఏమిటంటే మిస్సైల్ పరిజ్ఞానం వ్యాప్తిని అరికట్టడం. మానవ రహిత విమానాలు, 500 కేజీలు అంతకంటే ఎక్కువ ప్రేలుడు సామర్ధ్యం కలిగి 300 కిమీ దూరంవరకు ప్రయోగించగల ఆధునిక మిసైల్స్, సామూహిక మారణాలకి దారి తీసే మిసైల్స్ లేదా పరికరాలు వగైరా ప్రపంచదేశాలన్నిటికీ వ్యాప్తి చెందకుండా నిరోధించడం. కానీ ఎం.టి.సి.ఆర్.లో సభ్యత్వం వలన ఆ అత్యాధునిక ఆయుధాలు, మిసైల్స్ వంటివి సమకూర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
- కనుక ఇక నుంచి భారత్ విదేశాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మిస్సైల్ టెక్నాలజీని కొనుగోలు చేసుకోవచ్చు అలాగే రష్యా సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ వంటి మిసైల్ కంటే ఇంకా అత్యాధునిక పరిజ్ఞానం గల మిసైల్స్ అభివృద్ధి చేసుకోవచ్చు.