100 శాతం విదేశీ పెట్టుబడులకు గేట్లు ఎత్తేసిన భారత్
దేశానికి కీలకమైన రంగాల్లో నేరుగా నూరుశాతం పెట్టబడులు పెట్టుకోడానికి కేంద్రప్రభుత్వం విదేశాలకు పూర్తిగా తలుపులు తెరిచేసింది. రఘురామ్ రాజన్ రిజర్వుబ్యాంక్ గవర్నర్ పదవి నుంచి దిగిపోగలనని రెండు నెలలు ముందుగానే ప్రకటించిన నేపధ్యంలో స్టాక్ మార్కెట్ కూలిపోకుండా 100 శాతం ఫారిన్ డైరెక్టు ఇన్వెస్టు మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన నరేంద్రమోదీ టైమింగ్ ని న్యూస్ టివిల బిజినెస్ ఫోకస్ మార్కెట్ వర్గాలు విశేషంగా ప్రశంసించాయి.
అయితే ఇదే చర్యకు యుపిఎ ప్రభుత్వం సిద్దమైనపుడు తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి ఇపుడు అదేపనినిపూనుకోవడంలో సిగ్గులేనితనం అధికారపార్టీకే తెలియాలి. ఎఫ్ డి ఐ విషయంగా కాంగ్రెస్ ప్రతిపాదనలను తప్పుపట్టిన బిజెపి …తాను అధికారంలోకి వచ్చాక అదే ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఇప్పటికే వున్న విదేశీపెట్టు బడులను భారతప్రభుత్వం అనుమతి కూడా తీసుకోనవసరం లేకుండా నేరుగా విదేశీసంస్ధలే నూరుశాతానికి పెంచుకోవచ్చన్న అనుమతిద్వారా గేటు పూర్తిగా తెరిచెయ్యడం కాదు అసలు గేటే లేకుండా చేసింది. ”కోడలికి బుద్ధిచెప్పి అత్త రంకాడ బోయింది” అనే సామెత ఎంత మొరటుగా వుందో ఎన్ డి ఎ ప్రభుత్వ నిర్ణయం కూడా అంతే సిగ్గుమాలినట్టు వుంది. మనదేశంలో విదేశీయుల ఆర్ధిక ఆధిక్యతను వ్యతిరేకించే ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్ధ స్వదేశీ జాగరణ్ మంచ్ ఇపుడు విదేశీ పెట్టుబడులకు పూర్తిగా గేట్లు తెరిచెయ్యడాన్ని ఎలా సమర్ధిస్తుందో చూడాలి!
ఈ నిర్ణయం ప్రకారం డిఫెన్స్, ఎయిర్‌లైన్స్ రంగాల్లో వందకి వంద శాతం, ఫార్మా రంగంలో 74 శాతం పెట్టుబడులకు విదేశీ సంస్ధలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతంగా ఉండేది. విదేశీ పెట్టుబడులను ఒకేసారి 100 శాతానికి పెంచడం ఇదే మొదటిసారి.
రక్షణ రంగంలో ఎఫ్‌డిఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం-1959కి సవరణలు చేసింది. దీనిద్వారా చిన్న చిన్న ఆయుధాల తయారీలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతి లభిస్తుంది. రక్షణ రంగంలో ఎఫ్‌డిఐలకు సంబంధించి 2014లో యూపీఏ హయాంలోనే చర్చలు మొదలయ్యాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. కీలకమైన రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్ డీఐలకు అనుమతి సరికాదని ఆందోళనలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. 2015లో ప్రభుత్వ అనుమతితోనే వంద శాతం ఎఫ్‌డిఐలకు అనుమతిస్తామని చెప్పిన మోది ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చింది. 2016 నాటికి డిఫెన్స్‌లో 49 శాతం ఎఫ్‌డిఐలు ఆటోమేటిగ్గా అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే పెట్టుబడులకు ఒకే చెప్పింది. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు.
అమెరికా పర్యటనలో మోది ఒబామాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రక్షణ శాఖలో వంద శాతం ఎఫ్‌డిఐలకు కేంద్రం తలుపులు బార్లా తెరచిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇది భారతదేశ ఆర్థికవ్యవస్థను విదేశీ పెట్టుబడిదారుల గుప్పిట్లో పెట్టడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఫార్మా రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారానే 74 శాతం ఎఫ్‌డిఐలకు ప్రభుత్వం అనుమతించింది. విదేశి పెట్టుబడుదారులు ప్రభుత్వ అనుమతి లేకుండానే 74 శాతం పాత కంపెనీలలో పెట్టుబడులు పెట్టే వీలుంది. కొత్తగా పెట్టే ఫార్మాసూటికల్ కంపెనీల్లో వంద శాతం పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్ రంగంలో కూడా వంద శాతం పెట్టుబడులకు ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఇందులో 49 శాతం ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఆటోమేటిక్ రూట్లో పెట్టుబడులు రానున్నాయి. ట్రేడింగ్‌లో మాత్రం ప్రభుత్వ అనుమతితోనే వంద శాతం పెట్టుబడులు రానున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ఫార్మా, ఏవియేషన్, రక్షణ రంగాల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు రానున్నాయి.