కరోనా బారిన పడి ప్రపంచం మొత్తం కోలుకుంటోంది.. కానీ ఇండియా మాత్రం..మరింతగా వైరస్ బారిన పడుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటలలో 39వేల కేసులు నమోదయ్యాయి. నిన్నామొన్నటిదాకా ఇది ఇరవై ఐదు వేల లోపు ఉండేది. ఇప్పుడు.. 40వేలకు చేరువ అయింది. మరణాలు కూడా.. క్రమంగా పెరుగుతున్నాయి. వారంలోనే నాలుగు వేల మందికిపై చనిపోయారంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. రోజువారీ కేసుల్లో అమెరికా తర్వాత ఇండియాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ప్రతీ రోజు 70వేల కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో ఆ సంఖ్య 40వేలకు చేరువలో ఉంది.
మొత్తం కేసుల విషయంలో ఇండియా మూడో స్థానంలో ఉంది. మరణాల విషయంలో మూత్రం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు మరణాలు సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూండటం.. ఆందోళన కలిగించే విషయమే. ప్రతీ రోజూ.. దాదాపుగా ఐదు వందల మంది కరోనా కారణంగా చనిపోయారు. రికార్డుల్లోకి ఎక్కని మరణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్న అంచనా కూడా ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం.. మెట్రో సిటీలు ఉన్న నగరాల్లోనే వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
అనూహ్యంగా ఢిల్లీలో పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. కొద్ది రోజుల కిందట.. ఢిల్లీలో లక్షల కేసులు నమోదవుతాయని ఆందోళన చెందారు. సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందంేమోనని భావించారు. గతంలో రోజుకు మూడు నాలుగు వేల కేసులు నమోదయ్యేవి.. ఇప్పుడు.. 1200 నుంచి 1600 మధ్య ఉంటోంది. మహారాష్ట్రలో మాత్రం ఇంకా తగ్గుదల కనిపించలేదు. దక్షిణాది రాష్ట్రం.. మెట్రో నగరం లేని ఏపీలో మాత్రం.. కరోనా కేసులు … భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి.