పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారు..?. ఈ విషయంపై ప్రధాని మోడీని ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పమంటే చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే..ఆయన సుదీర్ఘ ప్రసంగం చేసి.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు.. బ్లాక్‌మనీని అరి కట్టడానికన్నారు. తర్వాత ఉగ్రవాదుల దగ్గర డబ్బుల్లేకుండా చేయడానికన్నారు. తర్వాత క్యాష్ లెస్ లావాదేవీలు పెంచడానికన్నారు. తర్వాత రాజకీయ అవినీతిని రూపు మాపడానికన్నారు. ఆ తర్వాత ఉద్యోగులు లంచాలు తీసుకోకుండా.. చేయడం కోసం కూడా అన్నారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను ప్రకటించుకుంటూ వెళ్లారు. మొదటగా కేంద్రం.. కనీసం రూ. రెండు, మూడు లక్షల కోట్లు… బ్లాక్‌మనీ వెనక్కి రాకుండా ఉంటుందని ఆశ పడింది. ప్రజలకు ఆశలు కల్పించింది. ఆ మొత్తం బ్యాంకుల్లో వేస్తారేమోనని సామాన్యులు ఆశ పడ్డారు. కానీ చివరికి ఏం జరిగింది..?
రద్దు చేసిన నోట్లలో 99.3 శాతం వెనక్కి వచ్చాయి. అంటే దాదాపుగా మొత్తం వెనక్కి వచ్చేసింది. ఆ 0.7 శాతం కూడా.. ఇప్పటికీ.. ఏదో విధంగా మార్పిడికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని.. అప్పుడప్పుడలా.. రద్దయిన నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తూ.. దొరికిపోతున్న ఘటనలో వెల్లడిస్తున్నాయి. మరి.. కేంద్రం సాధించిన లక్ష్యాలేమిటి..?. ఈ లక్ష్యాలేమిటో కేంద్రానికే క్లారిటీ లేదు కానీ.. సాధించేశామని మాత్రం బయటకు ధీమాగా చెబుతోంది. ఏమి సాధించారో మాత్రం చెప్పలేకపోతోంది. కేంద్రం తీరుపై.. మాజీ అర్థిక మంత్రి చిదంబరం ఒక్కసారి గుస్సా అయ్యారు. నోట్ల రద్దు చేస్తు మోదీ తీసుకున్న నిర్ణయం.. అతి పెద్ద అనాలోచిత నిర్ణయమని తేల్చేశారు. ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రశంసించకపోవడం కాదు కదా కనీసం సమర్థించలేదని గుర్తు చేశారు.
దేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఒకటి ఉంటుంది. కేంద్రంలో ఉండే ప్రధాన ఆర్థిక సలహాదారు ఈ ఇలాంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కొద్ది రోజుల కిందట వరకూ.. అరవింద్ సుబ్రమణియన్ ఈ పదవిలో ఉండేవారు. ఆయన రాజీనామా చేశారు. నోట్ల రద్దు సమయంలో అరవింద్ సుబ్రమణియనే ఉన్నారు. కానీ ఈ నిర్ణయం ఆయనకు తెలియదు. ఇలాంటి కీలక నిర్ణయం ఆయనకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది? చిదంబరం ప్రశ్నించారు. మరో లక్ష్యాలు సాధించామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కూడా ఫైరయ్యారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆపై జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.