తొలి టెస్టులో ఓటమికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో.. ఇంగ్లండ్ పై 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ భారత్ కి పోటీ ఇవ్వలేకపోయింది. అశ్విన్, అక్షర్ పటేల్ ద్వయం.. బంతిని గింగిరాలు తిప్పడంతో… ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ బొక్క బోర్లా పడ్డారు. 53 పరుగులకు 3 వికెట్ల ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. అశ్విన్, అక్షర్ల బంతుల్ని ఎదుర్కోలేక వికెట్లు అప్పగించింది. రూట్ (33), బెన్ స్ట్రోక్ (8), లారెన్స్ (26) పోప్ (12)…. ఇలా వచ్చినవాళ్లు…వచ్చినట్టే వెనుదిరిగారు. లంచ్ లోపే 9 వికెట్లు కోల్పోయింది. లంచ్ తరవాత.. మొయిన్ అలీ (18 బంతుల్లో 43 పరుగులు) సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఓటమి తప్పదని తెలిసి… బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చివరికి కులదీప్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అవ్వడంతో… ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 164 పరుగులకు ముగిసింది. దాంతో… భారత జట్టు 317 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ కి 5 వికెట్లు దక్కాయి. అశ్విన్ 3, కులదీప్ 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేయడంతో పాటు.. మొత్తంగా 8 వికెట్లు తీసిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.