భారత్ – బంగ్లాల మధ్య కాన్పూర్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. నాలుగో రోజు ఆట మొదలైనా, ఈ మ్యాచ్ ఎలాగూ నిస్సారమైన డ్రా అయిపోతుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. కానీ భారత్ అద్భుతమైన ఆట తీరుతో ఈ మ్యాచ్‌ని తన వైపుకు లాక్కొంది. మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలుపు అవకాశాల్ని సృష్టించుకొంది. అంతే కాదు.. ఏకంగా 5 ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టింది.
టెస్ట్ క్రికెట్ లో అత్యంగా వేగంగా టీమ్ 50, 100, 150, 200, 250 స్కోర్లు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్… అత్యంత దూకుడైన ఆట తీరు ప్రదర్శించింది. ఓపెనర్లు రోహిత్ (11 బంతుల్లో 23) జస్వాల్ (51 బంతుల్లో 72) మెరుపు ప్రారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ల ధాటికి 3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అది ప్రపంచ రికార్డ్. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదు. 100, 150, 200, 250 పరుగుల్ని అతి తక్కువ బంతుల్లో సాధించిన జట్టుగా వరల్డ్ రికార్డులు బద్దులు కొట్టింది. 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఓవర్‌కు 8.22 పరుగుల రన్ రేట్ తో భారత్ ఈ పరుగుల్ని సాధించడం విశేషం. దాదాపు టీ 20 తరహాలో భారత్ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఇంకా 26 పరుగుల వెనకే ఉంది. బంగ్లాని వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తే.. భారత్ ఈ మ్యాచ్ ని గెలవొచ్చు.
ఇదే మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. జడేజా 300వ వికెట్ పడగొట్టాడు. భారత్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ల జాబితాలో నిలిచాడు. 300 వికెట్లు అందుకొన్న తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే. ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ సిక్సులు (90) బాదిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. కోహ్లి టెస్టుల్లో 27000 పరుగుల మైలు రాయి అందుకొన్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో కోహ్లి ఈ ఘనత సాధించాడు.