ఆర్థిక రంగంలో డ్రాగన్ అని పేరున్న చైనా ఖ్యాతి మసకబారుతోంది. భారత్ పైపైకి ఎగబాకుతోంది. అమెరికా, జపాన్ లతో కలిసి భారత్ బలగాలు శనివారం నాడు బంగాళాఖాతంలో ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకటలు, సబ్ మెరైన్లు సహా నావికాదళ పాటవాన్ని మూడు దేశాలూ సముద్ర జలాల్లో ప్రదర్శిస్తున్నాయి, మలబార్ విన్యాసాల పేరుతో ఇవి ఆరు రోజులు జరుగుతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మూడు దేశాలూ చైనా వ్యతిరేకమైనవే. భారత్, చైనాల మధ్య ఇటీవలి కాలంలో అనేక ఆర్థిక ఒప్పందాలు కుదిరినా సరిహద్దు వివాదాలు అలాగే ఉన్నాయి. చైనా ఎఫ్పటికీ భారత్ కు మిత్ర దేశం కాదనే తరహాలోనే డ్రాగన్ వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ కు వీలైనంత సహాయం చేస్తూనే ఉంది. అమెరికాతో ఒక విధంగా చైనా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందనే అభిప్రాయం ఉండనే ఉంది. జపాన్ తో సముద్ర జలాల వివాదం సశేషంగా ఉంది.
అందుకే, ఈ మూడు దేశాల సైనిక విన్యాసాలు మొదలు కాగానే చైనా కడుపు మంటను అక్కడి మీడియా బయట పెట్టింది. చైనా వ్యతిరేక కూటమి వలలో పడకుండా భారత్ అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చింది. భారత్, చైనా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని కొనసాగించాలని సూచించింది. భారత్ ఆర్థిక రంగంలో దూకుడుగా ముందుకు పోతోంది. వృద్ధి రేటులో ఇప్పటికే చైనాను అధిగమించింది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అటు అమెరికా అగ్రరాజ్యం. ఇటు జపాన్ మొన్నటి వరకూ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ మూడు దేశాల సంబంధాలు బలపడటం చైనాకు మింగుడు పడటం లేదు.
ప్రపంచమతా తనకు శత్రువైనా భారత్ ను నయానో భయానో కాస్త మిత్రదేశంలో మలచుకోవాలని అనుకుంది. కానీ భారత్ బలమైన దేశంగా తనదైన నిర్ణయాలు తీసుకుంది. చైనాను నమ్మడం మూర్ఖత్వమని ప్రపంచానికి తెలుసు. భారత్ కు ఇంకా బాగా తెలుసు. అందుకే, అమెరికా, జపాన్ లతో మైత్రీబంధాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక ముందు అన్ని విషయాల్లోనూ చైనాకు చెక్ పెట్టే స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఇక మీదట చైనా ఎంత ఏడ్చినా లాభం లేదు. ఇది ఒకప్పటి భారత్ కాదు. నెహ్రూ కాలంలో ఏనుగులా ఉన్న భారత్ ఇప్పుడు పులిలా మారింది. ఈ వాస్తవాన్ని చైనా గుర్తించినా గుర్తించక పోయినా, పులి పులే.