రెండో టెస్టులోనూ టీమిండియా తొలి రోజే దాదాపుగా కాడి దించేసింది. పూర్తి పచ్చికగా కనిపిస్తున్న పిచ్‌ను చూసి… బౌన్సీ పిచ్ అని.. ముందుగానే… డల్ అయిపోయారేమో కానీ..ఒక్కరంటే.. ఒక్కరు కూడా… నిర్భయంగా ఆడలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే ఆలౌటయ్యారు. ముగ్గురు బ్యాట్స్మెన్లు మాత్రమే అతి కష్టం మీద అర్థసెంచరీలు చేశారు. విహారి 55, పృథ్వీ షా 54, పుజారా 54 పరుగులు చేసి.. కాస్త పరువు నిలిపారు. ఆ తర్వాత ఒక్క స్టార్ బ్యాట్స్‌మెన్ కూడా నిలబడలేకపోయారు. పేలవ ఫామ్‌తో… ఇబ్బంది పడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశజనక ప్రదర్శన చేశాడు. కేవలం మూడు అంటే మూడు పరుగులు చేసి.. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తాను ఔట్ కాదని.. రివ్యూ చేసుకున్నా.. ఫలితం లేకపోయింది.
న్యూజిలాండ్ బౌలర్లలో జెమ్మీసన్కు ఐదు వికెట్లు, సౌథీ, బోల్ట్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్… ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి.. వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఇరవై మూడు ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ.. వికెట్ తీయలేకపోయారు. అసాధారణ బౌలింగ్ ప్రతిభను చూపి కివీస్ ఆటగాళ్లను కుప్పకూలిస్తే.. తప్ప టీమిండియాకు అవకాశం లేనట్లే. . రెండో టెస్ట్ పై.. తొలి రోజే … కివీస్ పట్టు బిగించినట్లయింది. పర్యటన ప్రారంభించిన తర్వాత తొలి సారి ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియాకు అందరూ ఎదురు లేదనుకున్నారు.
ఆ ఆత్మవిశ్వాసం.. అతిగా మారిపోయిందేమో కానీ.. తర్వాత ఒక్కటంటే.. ఒక్క మ్యాచ్‌లోనూ కనీస పోటీ ఇవ్వడానికి టీమిండియా ఆటగాళ్లు తడబడుతున్నారు. తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు.. గట్టిగా పోరాడకపోతే… అంత కంటే ఘోరపరాజయం ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఫాస్ట్ పిచ్ లపై భారత ఫాస్ట్ బౌలర్లు కివీస్ ఆటగాళ్లపై కనీస ప్రభావం చూపలేకపోయారు.