వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోవడం చూశాం. మంచు వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూశాం. వెలుతురు లేకపోవడం వల్ల మ్యాచ్ నిలిచిపోయిన సందర్భాలు కోకొల్లలు. అయితే సూర్యుడి వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూశామా? ఈరోజు అదే జరిగింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు సూర్యుడు అడ్డు తగిలాడు. సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్లలో పడడం వల్ల ఈ మ్యాచ్‌ని తాత్కాలికంగా ఆపేశారు. సూర్యుడి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి రావడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 157 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు సమాధానంగా బరిలోకి దిగిన భారత్ 10 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. ఈ సమయంలోనే సూర్య కిరణాలు నేరుగా బాట్స్మెన్ కళ్లలోకి తాకడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. దాదాపుగా 40 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది. కాసేపట్లో మ్యాచ్ పునః ప్రారంభం కానుంది.