ఎన్ని ప్రభుత్వాలు మారినా… భారత తలరాత మారటం లేదు. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం… పారదర్శకత పాటిస్తున్నామని మోడీ సర్కార్ ఎన్ని గొప్పులు చెబుతున్నా అసలు కథ మాత్రం అలాగే ఉంది. అవును భారత్ ను ఎంతోకాలంగా పట్టిపీడిస్తున్న లంచాల వ్యవహారంలో రోజు రోజుకు భారత్ రికార్డు సృష్టిస్తోంది. తాజాగా ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో…. లంచాల విషయంలో భారత్ నంబర్ వన్ అని తేలింది.
భారత్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది ప్రజలు ప్రభుత్వ సర్వీసుల కోసం లంచాలు ఇవ్వాల్సివస్తోందట. 69శాతం మంది ప్రజలు ప్రభుత్వ సేవలు పొందాలంటే తప్పనిసరిగా లంచాలు ఇస్తున్నారని తేలింది. భారత్ తర్వాత రెండో స్థానంలో వియత్నాం ఉంది. ఇక పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లు కూడా లంచాల విషయంలో భారత్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. చైనాలో 26శాతం మంది లంచాలు ఇస్తుండగా… పాకిస్థాన్ లో 40 శాతం లంచాలు ఇస్తున్నారు. ఐతే, జపాన్ లో మాత్రం కేవలం 0.2 శాతం మాత్రమే లంచాలు ఇస్తున్నారు. దక్షిణ కొరియాలోనూ ఇది 3 శాతమే ఉంది.
గతేడాదితో పోలిస్తే మాత్రం చైనాలో లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వేగంగా పెరుగుతోందని సర్వేలో తేలింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 16 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది గతేడాది ఒక్కసారైనా లంచం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
Mahesh Beeravelly