హైదరాబాద్: భవిష్యత్తులో ఏదో ఒకరోజు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విలీనమై అఖండ భారత్‌గా గానీ, ఉమ్మడి భారత్‌గా గానీ ఆవిర్భవిస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆరెస్సెస్ కీలక నేత రామ్ మాధవ్ అన్నారు. అల్ జజీరా న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మికంగా పాకిస్తాన్లో పర్యటించటానికి ముందురోజు మాధవ్ చేసిన ఆ వ్యాఖ్యలు మోడి-షరీఫ్ భేటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చారిత్రక కారణాల నేపథ్యంలో గత 60 ఏళ్ళ కిందట విడిపోయిన ఈ ప్రాంతాలు ఏదో ఒక రోజు ఏకమవుతాయని ఆరెస్సెస్ ఇప్పటికీ ప్రగాఢంగా నమ్ముతోందని, అయితే ఆయా దేశాలు యుద్ధంతో కాకుండా మంచితనం, ఇష్టంతోనే ఒక్కటవుతాయని రామ్ మాధవ్ అన్నారు. ప్రపంచ చరిత్రను చూస్తే జర్మనీ, వియత్నాం దీనికి చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ దేశాలు ముందుకొచ్చి కలిసిపోయినపుడు భారత్, పాకిస్తాన్ల విషయంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. తాము భారత్‌ను హిందూ దేశంగా పిలుస్తామని, దీనికి మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. భారతదేశానికి ఆరెస్సెస్ సిద్ధాంతం సర్వోన్నతమైనదని, ఆ సంస్థను ఫాసిస్ట్ అనుకున్నా, కలహాలమారి అనుకున్నా సరే ఆ సిద్ధాంతమే గొప్పదని చెప్పారు. అల్ జజీరా తనను 7నే ఇంటర్వ్యూ చేసిందని, అయితే అది శుక్రవారం రాత్రి ప్రసారం కావటం యాధృచ్ఛికమని రామ్ మాధవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.