పఠాన్ కోట్ దాడుల తరువాత భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ మొదటికి వచ్చినప్పటికీ రెండు దేశాలు చాలా సంయమనంతో వ్యవహరిస్తుండటం అందరూ గమనించవచ్చును. కానీ యధాప్రకారం పాక్ తన అతితెలివి తేటలు, వక్రబుద్ధి ప్రదర్శించుకోవడం మాత్రం మానుకోలేదు. పఠాన్ కోట్ దాడులకు సూత్రధారిగా అనుమానిస్తున్న మసూద్ అజహర్ పై నిషేధం కోసం ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రయత్నానికి చైనా సహాయంతో గండి కొట్టింది. పఠాన్ కోట్ కి తన దర్యాప్తు బృందాన్ని పంపింది కానీ భారత్ దర్యాప్తు బృందం పాక్ లో పర్యటించడానికి అనుమతించలేదు. అయినా కూడా భారత్ సంయమనంగానే వ్యవహరించడానికి కారణాలు ఏమిటో తెలియదు. (బహుశః జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగడానికి పిడిపితో చేసుకొన్న రహస్య ఒప్పందంలో పాక్ తో సఖ్యతగా ఉండి తీరాలనే షరతు ఉందేమో?) భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని డిల్లీలోని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ వారం రోజుల క్రితమే ప్రకటించారు. అంటే మోడీ ప్రభుత్వం పాక్ తో చర్చలకు ఆసక్తి చూపడంలేదని అర్ధమవుతోంది. కానీ పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా నిన్న ఇస్లామాబాద్ లో పాక్ మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి పూర్తి టచ్చులోనే ఉన్నట్లు చెప్పారు. భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం నిర్వహించడానికి విధివిధానాల గురించి చర్చలు జరుగుతున్నాయని కన్నుక త్వరలోనే ఆ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని జకారియా చెప్పారు. పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ అటువంటి ఆలోచనలేమీ చేయడంలేదని చెపుతుంటే, జకారియా చర్చలకు రంగం సిద్దం అవుతోందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే భారత ప్రజలను మోడీ ప్రభుత్వం మభ్యపెడుతోందా లేక పాక్ తన అతితెలివి తేటలు ప్రదర్శిస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. ఏమయినప్పటికీ పాక్ ఇటువంటి నక్క జిత్తులు ప్రదర్శించడం, భారత్ దాని ముందు మోకరిల్లుతూ ఉండటం సర్వ సాధారణమయిపోయింది. కనుక దీనిని కూడా ప్రజలు లైట్ తీసుకోవాలి.