డిల్లీలో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి, భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ తో నిన్న సమావేశమయ్యారు. వారి సమావేశం పరస్పర ఆరోపణలతో మొదలయ్యి వాటితోనే ముగిసింది. సమావేశం మొదలవగానే పఠాన్ కోట్ దాడులు, ముంబై ప్రేలుళ్ళ గురించి ప్రస్తావించి, వాటికి కారకులైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తునంత కాలం, ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఆశించడం అత్యాశే అవుతుందని జయశంకర్ చెప్పగా, భారత్-పాక్ సంబంధాలు దెబ్బ తినడానికి ప్రధాన కారణం కాశ్మీర్ సమస్య అని ఐజాజ్ అహ్మద్ చౌదరి వాదించారు. పాక్ లోని బలూచిస్తాన్ లో భారత్ నిఘా సంస్థ ‘రా’ తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తోందని, అలాగే సంజౌతా ఎక్స్ ప్రెస్ ఘటనలో దోషులను పట్టుకొని శిక్షించడానికి భారత్ సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఆ ఆరోపణలను జయశంకర్ ఖండించారు. దాదాపు రెండు గంటల పాటు వారి సమావేశం ఇదేవిధంగా సాగింది. చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఆ కారణంగానే ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.
పఠాన్ కోట్ దాడుల గురించి ఇకపై జరిగే ప్రతీ సమావేశంలో భారత్ తమని తప్పకుండా నిలదీస్తుందని పాకిస్తాన్ ఊహించబట్టే, బలూచిస్తాన్ కధని రెడీ చేసిపెట్టుకొంది. అలాగే పఠాన్ కోట్ గురించి భారత్ ప్రశ్నిస్తే, సంజౌత ఎక్స్ ప్రెస్ కేసు గురించి పాక్ ఎదురుప్రశ్నిస్తోంది. భారత్-పాక్ సంబంధాలు దెబ్బ తినడానికి కారణం ఉగ్రవాదమని భారత్ వాదిస్తే, కాదు కాశ్మీర్ సమస్య అని పాక్ వాదిస్తోంది. పఠాన్ కోట్ దాడులకు కుట్రలు పన్నినవారు తమ దేశంలోనే ఉన్నారని, వారిని పట్టుకొని శిక్షిస్తామని మొదట చెప్పిన పాక్, నాలుగు నెలలు గడిచినా ఆ పని చేయకుండా తిరిగి భారత్ నే నిందించడం విస్మయం కలిగిస్తుంది. ఐజాజ్ అహ్మద్ చౌదరి వాదనలు గమనించినట్లయితే పాక్ కపట వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మరొకమారు స్పష్టం చేసినట్లుంది. ఇరుగు పొరుగు దేశాలతో శాంతి, స్నేహం కోరుకొంటున్నామని చెపుతూ పాక్ మళ్ళీ ఈవిధంగా వ్యవహరించడం, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో పాక్ దళాలు మళ్ళీ భారత్ దళాలపై కాల్పులు మొదలుపెట్టడం పాక్ ద్వంద వైఖరికి ప్రత్యక్ష నిదర్శనాలే. కనుక దాని పట్ల భారత్ కూడా ఒక నిశ్చిత, కటిన వైఖరిని అవలంభించడం చాలా అవసరం.