ఒకరు 70 గంటలు పని చేయాలంటారు.. మరొకరు 90 గంటలు అంటారు. ఇంట్లో భార్యల ముఖాలు చూసుకుని ఎంత సేపు ఉంటారు.. వచ్చి పని చేయండని సలహాలిస్తారు. ఈ సలహాల సంగతేమో కానీ.. ఇప్పుడు రోజుకు ఎనిమిది గంటల చొప్పున చేస్తున్న పని వల్లనే ఉద్యోగులు బర్న్ అవుట్ అవుతున్నారు. అంటే మానసికంగా అలసిపోతున్నారు. భారత్ లో వివిధసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా అరవై రెండు శాతం మానసిక అలసటకు గురవుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
మానసిక అలసటను.. బర్న్అవుట్గా ఉద్యోగవర్గాలు చెబుతూంటాయి. ఇలా బర్న్ అవుట్ అయ్యే ఉద్యోగుల సగటు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉంది. ఇరవై శాతంలోపే ఉంది. కానీ ఇండియాలో ఇది 62 శాతానికి చేరుకుంది. అంటే.. ఉద్యోగం చేస్తున్న వారిలో ఒత్తిడికి గురి కాని వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు యాజమాన్యాలు కల్పిస్తాయి. తాము జీతం ఇస్తున్నాము కాబట్టి ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టవచ్చని అనుకుంటాయి. నిజానికి వ్యవస్థీకృత రంగంలోనే.. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
ప్రపంచంలో అత్యధికంగా పనిగంటలు భూటాన్ ప్రజలు చేస్తున్నారు. వారు వారానికి 55 గంటల పాటు పని చేస్తున్నారు. ఇదే అత్యధికం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత కంటే తక్కువగానే పనులు చేస్తున్నారు. గల్ఫ్ లో ఉద్యోగులు యాభై గంటలు.. ఇండియాలో 46 గంటల పాటు పని చేస్తున్నట్లుగా తాజా అధ్యయనంలో తేలింది. వారానికి 46 గంటలు పని చేస్తున్నా బర్న్ అవుట్ అవుతున్నారంటే.. ఇక 90 గంటలు పని చేస్తే .. తట్టుకోవడం సాధ్యం కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.