భారత్ వెలిగిపోతోందని… ఎక్కడికో వెళ్లిపోతున్నామని ప్రచారం జోరుగా సాగుతూంటుంది. కానీ నిజం మాత్రం అది కాదని గ్లోబల్ ర్యాంకులు కొన్ని కొన్ని సార్లు వెల్లడిస్తూ ఉంటాయి. దీనికి తాజా సాక్ష్యం గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్నిదేశాల్లో శిశుమరణాలు, పోషకాహారం ఎంత మందికి ఎలా అందుతుందో రికార్డుల్ని పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి ఈ వివరాను వెల్లడిస్తుంది. ఈ నివేదికలో భారత్ 105వ స్థానంలో ఉంది. భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్న దేశాల గురించి చెప్పుకుంటే మనకు సిగ్గు చేటు.
భారత్లో భావి పౌరులకు పోషకాహారం అందడం లేదని, శిశుమరణాలు కూడా ఎక్కువేనని చెప్పి ఆందోళనకర స్థాయి అని రేటింగ్ ఇచ్చింది. నిజానికి భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. చైనాను దాటిపోయాం. కానీ ప్రజలందరికీ అవసరమైన పోషకాహారం మాత్రం పంపిణీ చేయలేకోపోతోంది ప్రభుత్వం. ఈ విషయంపై స్పష్టత వచ్చిందేమో కానీ గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫైడ్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. అంటే పోషకాలు బియ్యంలో కలుపుతారన్నమాట.
ఇలాంటి నివేదికలు ఎప్పుడు బయటకు వచ్చినా కేంద్రం ఐక్యారాజ్యసమితితో పాటు ఆయా సంస్థలపై ఎదురుదాడి చేస్తూంటుంది. భారత్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రగా చెబుతూంటుంది. దేశంలో పోషకాహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారి బాధలు బయటకు రాకుండా చేస్తే అదే గొప్ప విజయం అనుకుంటోంది. కానీ దేశం లో జరుగుతున్న అభివృద్ధి అందరికీ సమానంగా లేదు. పేదలు మరింత పేదలవుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ఈ అంతరం పెరిగిపోతున్న ఫలితమే హంగర్ ఇండెక్స్లలో ఆందోళనకరస్థాయి. దీనికి ఎదురుదాడి సరిపోదు… మానవత్వంతో ప్రభుత్వాలు వ్యవహరించాల్సి ఉంది.