హైదరాబాద్: రెండువారాల దక్షిణాది విడిదికోసం దేశ ప్రధమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ హైదరాబాద్ విచ్చేశారు. డిసెంబర్ 31 వరకు ఆయన సికింద్రాబాద్‌లోని బొలారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. ఈ రెండువారాల విడిదిలో ప్రణబ్ ముఖర్జీ అవసరాల గురించి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలంగాణ ప్రభుత్వానికి ఒక సందేశం పంపాయి. దానిద్వారా ప్రణబ్ ఆహారంలో తీసుకునే పదార్థాల వివరాలు బయటకొచ్చాయి.
బెంగాలీలంటేనే మత్స్యప్రియులని ప్రతీతి. వారికి చేప లేకుండా ముద్ద దిగదని అంటారు. అయితే ప్రణబ్ ముఖర్జీ మాత్రం సీ ఫుడ్ ఏమీ తినరట. ప్రణబ్ తినని పదార్ధాల జాబితాలో రొయ్యలు, తదితర సీఫుడ్, క్రీమ్, చీజ్‌తో తయారయ్యే సాస్‌లు, కోడిగుడ్లలోని పచ్చసొన ఉన్నాయి. అయితే కోడిగుడ్డు తెల్లసొనమాత్రం తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రౌన్ బ్రెడ్, సిరీల్స్(తృణధాన్యాలు), పళ్ళు, మొలకెత్తిన గింజలు తీసుకుంటారు. భారతీయ వంటకాలన్నింటినీ రైస్‌బ్రాన్ ఆయిల్‌తో, కాంటినెంటల్ వంటకాలను ఆలివ్ పొమేస్ ఆయిలతో, సలాడ్ డ్రెస్సింగ్లను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో వండుతారు. దాహమేస్తే గోరువెచ్చని మినరల్ వాటర్ తాగుతారు. మింట్ ఫ్లేవర్ టీ తీసుకుంటారు. ఆహారంగానీ, డ్రెస్సింగ్స్ గానీ పుల్లగా ఉండకూడదు. తీపి పదార్థాల తయారీలో పంచదారను తక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక శనివారాలనాడు ఆయనకు మెనూ వేరుగా ఉంటుంది.
రాష్ట్రపతి భవన్ సూచించిన ఆహార పదార్థాలు, సిరీల్స్, వంటవారితపాటు హైదరాబాద్‌కు ముందే వస్తాయని తెలంగాణ అధికారులు చెప్పారు. కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, కిచెన్వేర్, గ్యాస్ మాత్రమే తాము సరఫరా చేస్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లతో పాటుగా రాష్ట్రపతి వెంట వచ్చే సిబ్బంది కోసం మూడు క్వింటాళ్ళ సోనా మసూరి బియ్యం సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రపతి ఇక్కడ ఉండే రెండు వారాలలో డిసెంబర్ 19న మాత్రం ఒక రోజు పర్యటనకు కర్ణాటక వెళతారు… డిసెంబర్ 25న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. 27న మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ఆయుత చండీయాగానికి ప్రణబ్ హాజరవుతారు.