దౌత్యనీతిలో తాను ఎంత సమర్థుడినో ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించుకున్నారు. రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, ఇప్పటి అగ్రరాజ్యం అమెరికాతో దోస్తీ ద్వారా భారత్ అనేక విధాలుగా విజయాలు సాధించింది. మోడీ అమెరికా పర్యటనలో కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో భారత్ ప్రవేశానికి ఒబామా గట్టి మద్దతు ప్రకటించారు. చైనా అభ్యంతరం చెప్పినా భారత్ కు సభ్యత్వం అసాధ్యం కాదని సంకేతాలు వస్తున్నాయి. అంతే కాదు, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ లో భారత్ ప్రవేశం ఖాయమైంది.
ఈ పరిణామాల వల్ల భారత్ కు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యూహాత్మకంగా కీలకమైన టెక్నాలజీ దిగుమతికి అడ్డంకి తొలగిపోతుంది. సైనికంగా మరింత బలపడటానికి అవకాశం కలుగుతుంది. ఎన్.ఎస్.జి.లో సభ్యత్వం లభిస్తే మన బ్రహ్మోస్ వంటి క్షిపణులను భారీగా ఎగుమతి చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆర్జించ వచ్చు. క్షిపణి సాంకేతికతను కూడా ఇతర దేశాలకు ఇవ్వవచ్చు.
మోడీ, ఒబామా సంయుక్త ప్రకటన విన్న తర్వాత చైనా, పాకిస్తాన్ పాలకులకు చెమటలు పట్టి ఉంటాయి. తమకు ఇష్టం లేకపోయినా రెండు వ్యవస్థల్లో భారత్ ప్రవేశానికి మార్గం సుగమం అవుతున్న సూచనలు ఆ దేశాలకు మింగుడు పడేవి కావు. ఎన్.ఎస్.జి.లో భారత్ చేరకుండా ఇప్పటికీ చైనా ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ పెద్దన్న అమెరికా నూటికి నూరు పాళ్లూ మద్దతిచ్చిన తర్వాత మిగతా దేశాలు చైనా వెంట వెళ్లే అవకాశం లేదు. కాబట్టి భారత్ కు ఎదురు లేదనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇటీవలే పాక్, చైనాలకు మింగుడు పడని మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ ఇరాన్ పర్యటనలో పాకిస్తాన్ కు పెద్ద షాకిచ్చారు. చబాహర్ రేవు నుంచి సరుకుల రవాణా, సహకారానికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఇది ద్వైపాక్షిక ఒప్పందం కాదు. త్రైపాక్షిక ఒప్పందం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. రెండు ముస్లిం దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం పాకిస్తాన్ కు మింగుడుపడే అవకాశమే లేదు.
మోడీ అమెరికా పర్యటన ముగియగానే మూడు దేశాలూ కలిసి చైనాకు మరో విధంగా చెక్ పెట్టబోతున్నాయి. పశ్చిమ పసిఫిక్ జలాల్లో భారత్, అమెరికా, జపాన్ సంయుక్త నౌకా విన్యాసాలు చేస్తాయి. శుక్రవారం నుంచి 8 రోజుల పాటు ఈ మూడ దేశాల యుద్ధ నౌకల విన్యాసం కొనసాగుతుంది. ఈ మహాసముద్ర జలాల్లో కొంత భాగం తనదేనని చైనా వాదిస్తోంది. అలాంటి చోట భారత్ మరో రెండు మిత్రదేశాలతో కలిసి తన యుద్ధనౌకల చేత విన్యాసాలు చేయించడం మామూలు విషయం కాదు.
ఇప్పటికే వృద్ధి రేటులో చైనాను భారత్ అధిగమించింది. ఆర్థిక రంగంలో దూకుడుగా దూసుకుపోతోంది. మొత్తం మీద, భారత్ తో శత్రుత్వం, పాక్ తో మిత్రుత్వం వల్ల నష్టమే తప్ప లాభం లేదని చైనా గుర్తించే రోజు వస్తుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు. అది వచ్చినా రాకపోయినా భారత్ మాత్రం చైనాకు చెక్ పెట్టడంలో సఫలమైంది. మోడీ వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయింది.