ప్రపంచానికి కమ్యూనిజం పాఠాలు చెప్పే చైనా, అవినీతిలో బాగా పండిపోయింది. ఈ విషయంలో చాలా కాలంగా లోకానికి తెలుసు. అక్కడి ప్రభుత్వం మాత్రం నంగనాచి కబుర్లు చెప్తుంది. ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈ విషయాన్ని ఘంటాపథంగా బయటపెట్టింది. మనకంటే చైనాలో అవినీతి మరీ దారుణమట.
అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో డెన్మార్క్ నెంబర్ వన్ గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్ నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, కెనడాలు టాప్ 10లో ఉన్నాయి.
భారత్ 85వ ర్యాంక్ పొందింది. చైనా 100వ స్థానంలో నిలిచింది, పాకిస్తాన్ లో అవినీతి మరీ ఎక్కువ. అందుకే ఆ దేశం 126వ ర్యాంక్ పొందింది. భారత్ లో అవినీతి స్వల్పంగా తగ్గిందని తాజా నివేదిక తెలిపింది. చైనాలో అవినీతి అనకొండలా వ్యాపించిందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టు దేశం కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. అయితే గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం చాలా మందికి కఠిన శిక్షలు విధించింది.
పేరుకు కమ్యూనిస్టు దేశమైనా, జరిగేదంతా రాచరికాన్ని తలపించే నిరంకుశ పాలన. ప్రజలు నోరెత్తే వీలులేదు. ప్రయివేటు మీడియాకు అవకాశం లేదు. ప్రజలు నచ్చిన వారికి ఓటేసే వీలే లేదు. పైగా, క్యాపిటలిస్టు విధానాన్ని పెద్ద ఎత్తున అవలంబించే దేశం చైనా. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో విదేశీ, స్వదేశీ కంపెనీలకు రాయితీలిచ్చి, భారీగా లాభాలు దండుకోవడానికి చైనా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అందుకే అక్కడ మిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. కమ్యూనిస్టు సిద్ధాంతానికి విరుద్ధంగా పెట్టుబడిదారులు ఆడింది ఆటగా మారింది. అవినీతి భారీగా పెరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి.