చైనా ఆర్ధిక మాంద్యం ప్రభావం భారతదేశం మీద లేనే లేదని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అంటూండగా, ఆప్రభావం మనదేశం మీద వుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ చెబుతున్నారు.
ఇద్దరు రాజకీయనాయకుల మధ్య లేదా ఇద్దరు ఆర్ధిక నిపుణుల మధ్య అభిప్రాయాలు తలఎత్తితే అది పెద్ద చర్చ అవుతుంది. అయితే ఇక్కడ వివాదం ఒక రాజకీయవాదికీ, ఒక ఆర్ధిక నిపుణుడికీ మధ్య మొదలైంది. ఇందులో విజయం అధికారంలో వున్న రాజకీయవేత్తలదేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
భారతదేశ పరపతి విధాన నిర్ణయాలలో రిజర్వ్ బ్యాంక్ దే కీలకపాత్ర. కరెన్సీలను ముద్రించడం, చలామణి చేయడం, అవసరాన్ని బట్టి నాశనం చేయడం, విదేశీ మార్కెట్ లో రూపాయి విలువను సురక్షితంగా వుంచడం లాంటి వ్యవహారాలు చక్కబెడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు నిల్వలను డిపాజిట్ రూపంలో తన దగ్గర భద్రపరచడం, ప్రభుత్వం తరపున చెల్లింపులు చేయడం, రాబడులు వసూలు చేయడం, విదేశీ మారకద్రవ్య పత్రాలను నిల్వ చేయడం లాంటి కర్తవ్యాలను నిర్వర్తిస్తుంది. బ్యాంక్ లకు లైసెన్స్ లివ్వడం, వాటి వ్యవహారాల మీద నిఘా వుంచడం, నగదు నిల్వల నిష్పత్తులను నియంత్రించడం, వడ్డీ రేట్లను నిర్ణయించడం లాంటి బాధ్యతలన్నీ ఆర్ బీఐ చేతిలోనే వుంటాయి.
1991, 1997, 2008, 2013 ….ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన మహా గడ్డు సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు చుట్టుముట్టిన చెడ్డ రోజులు. కానీ , ప్రపంచాన్ని కుదిపేసిన ఇలాంటి ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొని భారతదేశం నిలవగలింది. అగ్ర రాజ్యం అమెరికాలోని బ్యాంకింగ్ దిగ్గజాలే దివాలా తీసినా మన ప్రభుత్వరంగంలోని బ్యాంకింగ్ వ్యవస్థ చెక్కుచెదరలేదు. ఆయా సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలే మనల్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించాయంటూ అనేకమంది ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు ప్రశంసించారు.
అలాంటి ఆర్ బీఐ కే ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణల వల్ల ఆర్ బి ఐ అధికారాలకు కత్తెరపడే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇప్పటి దాకా స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా వ్యవహరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ బి ఐ విధివిధానాలనే మార్చేయడానికి పూనుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం ఈమధ్యే విడుదల చేసిన ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ ముసాయిదాలోని అసలు ఉద్దేశం ఇదేనని ఆల్ ఇండియా ఆర్ బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి. క్రాంతి వివరించారు . అసలు గవర్నర్ పదవిని చైర్ పర్సన్ పేరుకి మార్చేస్తోంది. ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో నలుగురిని ప్రభుత్వమే నియమించుకుని, వారి ద్వారా ఆర్ బీఐని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు స్కెచ్ గీసింది. ఆర్ బీఐ గవర్నర్ కున్న వీటో పవర్స్ ను కూడా రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్వల్ప కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తాను తీసుకునే నిర్ణయాలను బలపరిచే తోలుబొమ్మగా ఆర్ బీఐని మార్చేందుకు కేంద్రం తెగిస్తోంది.
ప్రభుత్వ ఒత్తిడికి ఆర్ బీఐ లొంగిపోయి, బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం వుంటుంది. స్వాతంత్ర్యానంతరం తొలితరం జాతీయ నాయకత్వం ప్రదర్శించిన విజ్ఞత ఆర్ బీఐ ని స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థగా తీర్చిదిద్దింది. దానిని కాపాడుకోవడానికే తాము సేవ్ ఆర్ బీఐ ఉద్యమం నిర్వహిస్తున్నట్టు ఆర్ బీఐ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అసోయేషన్స్ చెబుతున్నాయి.
ఆర్ బీఐ ని రక్షించండన్న నినాదంతో గురువారం 17వేల మంది రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు సామూహికంగా సెలవుపెట్టబోతున్నారు. దీంతో ఒక్క రోజే దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం వుంది.