దేశం మొత్తం ఇప్పుడు వణికిపోతోంది. హాస్పిటల్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. స్మశానాలూ ఖాళీ ఉండటం లేదనే వార్తలు గుండెను మెలిపెట్టేస్తున్నాయి. ఇండియా ఉన్న పరిస్థితి చూసి ప్రపంచదేశాలన్నీ దూరదూరంగా జరుగుతున్నాయి. ఇండియా నుంచి వస్తామంటే సొంత పౌరుల్ని కూడా ఆపేసే పరిస్థితి .. ఇక ఇండియన్స్‌ను రమ్మని పిలిచే పరిస్థితి ఎక్కడిది..? మొదటి వేవ్‌లో ఇండియా కన్నా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్న దేశాలు.. ఇప్పుడు దిలాసాగా ఉన్నాయి. కానీ ఇండియాకు మాత్రమే ఎందుకిలా..? ఈ అంశంపై కాస్త సావధానంగా ఆలోచిస్తే.. మనకు కనిపించే ఒకే ఒక్క కారణం.. వ్యాక్సిన్. వ్యాక్సిన్ విధానంలో లోపమే కారణం.
“ఫైజర్ టీకా” ముందుగా మన దగ్గరకే వచ్చింది..!
ఫస్ట్ వేవ్‌లో కోలుకోలేని దెబ్బ తిన్న అమెరికా ఇప్పుడు.. మాస్కులు అవసరం లేదని తమ పౌరులకు చెబుతోంది. దానికి కారణం.. ఫైజర్ వ్యాక్సిన్.
నిజానికి గత ఏడాది డిసెంబర్ ఐదో తేదీన భారతప్రభుత్వానికి ఫైజర్ దరఖాస్తు చేసింది. అప్పటికే అమెరికా, యూకే ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం.. ఇండియాలో కూడా.. క్లినికల్ ట్రయల్స్ చేసి.. వాటి ఫలితాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ప్రపంచం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో.. ఇతర దేశాల్లో ముఖ్యంగా అత్యున్నత టెస్టింగ్ ప్రమాణాలు ఉన్న దేశాల్లోనే వ్యాక్సిన్‌కు ఆమోదం లభించినందున… ఇండియాలో కూడా… పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి రాదని.. ఫైజర్ అనుకుంది. కానీ భారత ప్రభుత్వం అలా అనుకోలేదు.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ కన్నా ఎక్కువే పరీక్షలు చేసినా ఫైజర్ టీకాకు నో పర్మిషన్..!
ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి ఎందుకు ఇవ్వలేదో.. వైద్యనిపుణులకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే.. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ … అత్యువసర అనుమతులు పొందే నాటికి పూర్తి స్థాయి పరీక్షలు పూర్తి చేయలేదు. పీ3 లెవల్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాకుండానే పర్మిషన్ ఇచ్చారు. కోవాగ్జిన్‌కు ఇచ్చిన అత్యవసర అనుమతులు క్లినికల్ ట్రయల్స్ కోసమే అన్నట్లుగా చెప్పారు కానీ.. యధావిధిగా పంపిణీచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో… ఫైజర్ టీకా ఇంకా గొప్పగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నప్పటికీ.. ఎందుకు అనుమతి నిరాకరించారన్నది… ఆ రంగంలో నిపుణులకు విస్మయకరంగానే ఉంది. ధర కూడా.. ఫైజర్ ఎక్కువేమీ చెప్పలేదు. ఇప్పుడు కోవాగ్జిన్ ప్రజలకు ఎంత మొత్తానికి అమ్ముతామని ప్రకటించిందో.. అంతే మొత్తం ధరను ఫైజర్ ప్రతిపాదించింది.
అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయిన ఫైజర్..!
చివరికి ఎదురు చూసి.. చూసి … ఫైజర్ … అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తును ఫిబ్రవరిలో వెనక్కి తీసేసుకుంది. ఇండియాలో వ్యాక్సిన్ అమ్మాలనే ఆలోచనను విరమించుకుంది. భారత ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించకపోవడం.. పాలకుల్లో ఉన్న స్వార్థం వల్లనే ప్రపంచంలోనే బెస్ట్ టీకా అనదగ్గ ఫైజర్ భారత ప్రజలకు అందడం లేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. టీకాలు అందుబాటులోకి వచ్చే సరికి.. కరోనా ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. ఇక సెకండ్ వేవ్‌లు లాంటివేమీ రావని ఇండియాలోని వైద్య నిపుణులు కొంతమంది విశ్లేషించడం ప్రారంభించారు. కొన్ని రకాల సర్వేలు చేసి.. ఇండియాలో అరవై శాతం మందికి కరోనా వచ్చి పోయిందని చెప్పుకున్నారు. దీంతో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లుగా ఉంది. అదే సమయంలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. భారత ప్రజలకు అవసరం లేదని అనుకున్నారేమో కానీ.., ఫైజర్‌కు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం… దేశంలో తయారైన టీకాలను మాత్రం విదేశాలకు ఎగుమతి చేశారు. దేశంలో ఉన్న జనాభాతో పోలిస్తే.. ఉత్పత్తి చాలా స్వల్పమే అయినా… పరిమితంగా పంపిణీ చేస్తూ… విదేశాలకు వ్యాక్సిన్ మైత్రి పేరుతో ఎగుమతి చేసేశారు. ఫలితంగా సెకండ్ వేవ్ విరుచుకుపడేసరికి.. ప్రభుత్వం నిస్తేజంగా చూస్తూండిపోయింది. ప్రజలు చనిపోతుంటే.. ఏం చేయాలో తెలియక చేష్టలుడిగి చూస్తోంది.
ఇప్పుడు హడావుడిగా విదేశీ టీకాలకు అనుమతులు..!
కొసమెరుపేమిటంటే… ఇటీవల.. ఇండియాలో తయారవుతున్న వ్యాక్సిన్లు భారత ప్రజలకు సరిపోవని అర్థం అయింది. అందుకే విదేశీ వ్యాక్సిన్లకు పర్మిషన్ ఇస్తామని.. మూడు రోజుల్లోనే అనుమతులు ఇస్తామని ప్రకటించింది. కొన్ని విదేశీ వ్యాక్సిన్లు వస్తాయని చెబుతున్నారు. రష్యా వ్యాక్సిన్ ను రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తుందని కూడా చెబుతున్నారు. అయితే.. ఇదేదో ముందే ఇచ్చి ఉంటే.. దేశంలో కొన్ని వేల ప్రాణాలు నిలబడి ఉండేవి.. ఇప్పుడు.. అత్యంత కఠినమైన సంక్షోభం ముందు దేశం నిలబడి ఉండేది కాదన్న అంచనాలు సహజంగానే వినిపిస్తున్నాయి.
వాషింగ్టన్ పోస్ట్ చెప్పినట్లు.. కరోనా సిట్యూటేయేషన్లో ఇండియాను రక్షించాలా..? సొంత ఇమేజ్ను రక్షించుకోవాలా..? అన్న చాయిస్లో .. ప్రధానమంత్రి మోడీ.. సొంత ఇమేజ్కే్ ఓటేశారు. అందుకే ఇప్పుడు… భారత్ ఫైజర్ వ్యాక్సిన్స్ లాంటి అవకాశాలను కోల్పోయి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.