బెంగాల్లో మమతా బెనర్జీ అసాధారణ విజయం.. దేశ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితం .. తృణమూల్‌కు అనుకూలంగా వస్తూండగానే.. విపక్ష పార్టీల తరపున ఓ లేఖ విడుదలయింది. దాని ప్రకారం.. అన్ని రాష్ట్రాలకు.,. అందరు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలనేది దాని సారాంశం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, స్టాలిన్ సహా… మొత్తం పదమూడు మంది వివిధ పార్టీల నేతలు అందులో సంతకాలు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతెలెవరూ లేరు. బీజేపీ వ్యతిరేక కూటమి మరోసారి పురుడు పోసుకుంటుందని.. ఆ లేఖ తేల్చేస్తోందని జాతీయ మీడియా విశ్లేషించడం ప్రారంభమయింది.
మమతా బెనర్జీ..ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాశారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏపీ సీఎం జగన్… తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా లేఖలు రాశారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నందున పోరాటానికి బలం ఉంటుందని ఆమె అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించలేదు. కానీ ఇతర బీజేపీయేతర పక్షాల నేతలు మాత్రం స్పందించారు. ఓ కూటమిగా ముందుకేళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో పలు పార్టీలు మమతా బెనర్జీకి మద్దతు పలికాయి. ప్రస్తుతం బెంగాల్ విజయంతో మమతా బెనర్జీకి.. దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. మోడీకి ధీటైన నేతగా గుర్తింపు పొందుతున్నారు.
మోడీని ఢీకొట్ట చరిష్మా ఉన్న నేత కోసం ఇప్పుడు విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ యువ నేత రాహుల్ ఈ విషయంలో వెనుకబడి ఉన్నారు. ఇతర పార్టీల నేతలూ ముందుకు రాలేకపోయారు. అయితే.. ఇప్పుడు మమతా బెనర్జీ.. నేరుగా మోడీనే ఢీకొట్టి.. ఘన విజయం సాధించారు. దీంతో ఆమె… మోడీకి ప్రత్యామ్నాయ నేతగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక కూటమికి కూడా.. నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల.. మడీ సర్కార్‌పై వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాలు ఉన్నాయి. భావోద్వేగాలు ఎల్లకాలం పని చేయవని.. ఇప్పుడు ప్రజలకు అవగాహన పెరుగుతోందన్న అభిప్రాయం… పెరుగుతోంది. ఈ క్రమంలో దేశ రాజకీయంలో సరికొత్త మలుపులను.. బెంగాల్ ఎన్నికల ఫలితాలు తీసుకు రానున్నాయి.