కోహ్లి, కుంబ్లే టీం వర్క్ అద్భుతంగా వర్కవుట్ అయింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీ చేపట్టిన మరుక్షణం నుంచి కూడా ముందుగా డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని మార్చేశాడు. టీం మెంబర్స్ అందరి మధ్యలోనూ మంచి రిలేషన్స్ ఉండేలా చేయగలిగాడు. అన్నింటికీ మించి ఎవరు బాగా ఆడితే, బాధ్యతలను ఎవరు సమర్థవంతంగా నెరవేరిస్తే వాళ్ళకే టీంలో స్థానం అనే మెస్సేజ్‌ని గట్టిగా తెలియచేశాడు. ఆ వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు వరుసగా విజయాలను అందిస్తున్నాయి. విరాట్ కోహ్లిని గొప్ప కెప్టెన్‌గా నిలబెట్టే దిశగా సాగుతున్నాయి.
విరాట్ కోహ్లి టీంలో ఉన్న సమష్టితత్వం ఈ చివరి టెస్ట్‌లోనూ కనిపించింది. డబుల్ సెంచరీతో కోహ్లి, భారీ సెంచరీతో రహానే, అర్థ సెంచరీతో రోహిత్‌శర్మలు మొదటి ఇన్నింగ్స్‌లో బాధ్యతలు తీసుకున్నారు. అద్భుతంగా రాణించి ఇండియాని ఓటమికి దూరం చేశారు. ఆ తర్వాత అశ్విన్ సారధ్యంలోని బౌలింగ్ సేన న్యూజిలాండ్‌ని ఓటమి కోరల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా అశ్విన్ అయితే ఆరు వికెట్లతో అద్భుతమే చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇచ్చాక…ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో నల్లేరు మీద నడకలా ఉంటుంది వ్యవహారం. అదే జరిగింది. గౌతం గంభీర్ ఆడుతూ పాడుతూ అర్థ సెంచరీ చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అలాగే టీంలో స్థానాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. ఇక తొందరగా రన్స్ చేయాల్సిన పరిస్థితులకు తగ్గట్టుగా పూజారా అద్భుతంగా స్పందించాడు. తన శైలిని మార్చుకుని మరీ సూపర్ సెంచరీతో ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో మంచి జోష్ని తీసుకొచ్చాడు. అదే ఊపులో మన బౌలర్స్ అందరూ కలిసి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టి, కనీసం నిలదొక్కుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చి పడేశారు. కొండంత లక్ష్యం కూడా బ్లాక్ క్యాప్స్‌ని కంగారు పెట్టేసింది. ఓవరాల్‌గా అద్భుతమైన సిరీస్ విజయం కోహ్లిసేన సొంతమైంది. 3-0తో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయడంతో పాటు నంబర్ ఒన్ ర్యాంక్‌ని కూడా కొంతకాలం నిలబెట్టుకునేలా అగ్రస్థానంలో నిలిచింది టీం ఇండియా. హ్యాట్సాఫ్ టు కోహ్లి టీం, కుంబ్లే అండ్ కో.