భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా కొట్టే దెబ్బ.. నేరుగా పేద , మధ్య తరగతి వర్గాలపై పడబోతోంది. దేశంలో దాదాపుగా 40 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోతారని.. ప్రపంచ కార్మిక సంస్థ తేల్చేసింది. ఆర్బీఐ కూడా.. భారత వృద్ధి రేటు.. ఊహించనంతగా పడిపోతుందని.. లెక్క వేసుకుంది. భారత్లో అత్యధికం… చిరు వ్యాపారులు, చిరు సంస్థల్లో పని చేసేవారు.. రోజు కూలీలే. సాఫ్ట్ వేర్.. ఇతర సేవా రంగాల్లో పని చేసేవారు పరిమితంగానే ఉంటారు. ఇప్పుడు.. వారు .. వీరు అనే తేడా లేకుండా.. అందరికీ ఉద్యోగాల టెన్షన్ ప్రారంభమయిది. వైరస్ ప్రభావం ఎంత కాలం ఉంటుందో.. ఇంకా స్పష్టత లేదు. ఎంత ఎక్కువ డ్యామేజ్ జరిగితే.. అంత ఎక్కువగా ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతుంది.
ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లోనే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చైనా తర్వాత భారత్లోనే జనాభా ఎక్కువ. చైనా ప్రస్తుతం వైరస్ను దాదాపుగా నియంత్రించింది. అక్కడ పారిశ్రామికంగా కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇండియాలో మాత్రం.. లాక్ డౌన్ కారణంగా మొత్తం పారిశ్రామిక రంగం లాక్ అయిపోయింది. ఆర్థిక పరిస్థితులు మాంద్యం కారణంగా… పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం ఉద్యోగాలపై పడుతుంది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగించే అవకాశం ఉంది. ఎలా చూసినా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతున్న భారత్ …పేద దేశంగా మారిపోయే పరిస్థితి ఎదురవుతుందనే అంచనాలు ప్రారంభమయ్యాయి.
ఈ పరిస్థితిని ఎదుర్కొని.. ప్రజలను పేదరికం గండం నుంచి బయటపడేయడం.. అంత తేలికైన విషయం కాదనేది ఆర్థిక నిపుణుల అంచనా. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన రెండు వారాల్లోనే పరిస్థితి చాలా వరకూ విషమించింది. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కాకపోతే.. మొత్తానికే తేడా వస్తుందన్న అభిప్రాయం.. కేంద్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేస్తుందన్నదే కీలకంగా మారింది.