పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ఉగ్రవాదులు దాడి జరిగిన తరువాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ.) దానిపై దర్యాప్తు మొదలుపెట్టింది. వారి దర్యాప్తులో ఒక ఆసక్తికరమయిన విషయం బయటపడింది. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాదులు అమెరికాలో తయారయిన బైనాక్యులర్స్ వాడారని కనుగొన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద దొరికిన ఆయుధాలు, వారు వేసుకొన్న బట్టలు, బూట్లు వగైరా అన్నీ పాకిస్తాన్ కి చెందినవి స్పష్టమయిన చిహ్నాలున్నాయి. వారు ఉపయోగించిన బైనాక్యులర్స్ పై మాత్రం అమెరికాలో తయారయినట్లు స్పష్టమయిన ముద్రలున్నాయి.
బహుశః వాటిని ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైనికుల దగ్గర నుండి దొంగిలించయినా ఉండాలి లేదా పాకిస్తాన్ సైన్యానికి అమెరికా సరఫరా చేస్తున్నవయినా అయ్యుండవచ్చునని అనుమానిస్తున్నారు. ఒకవేళ రెండవదే నిజమయితే, పాకిస్తాన్ ఆర్మీ అధికారులే జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాదులకు వాటిని అందించి ఉండవచ్చునని అనుమానించక తప్పదు. కనుక ఆ బైనాక్యులర్స్ పై ఉన్న సీరియల్ నెంబర్స్ వగైరా వివరాలను ఎన్.ఐ.ఏ. అధికారులు అమెరికాకు పంపించి, వాటిని ఎవరికి కేటాయించారో తెలుసుకోవాలనుకొంటున్నారు. తద్వారా భారత్ చేస్తున్న ఆరోపణలకు మరిన్ని బలమయిన ఆధారాలు లభించినట్లవుతుంది.
ఒకవేళ వాటిని పాక్ ఆర్మీకి సరఫరా చేసినట్లు అమెరికా దృవీకరించినట్లయితే, పాక్ ప్రభుత్వం మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తుంది. పాక్ ఆర్మీ కోసం అమెరికా పంపిస్తున్న ఇటువంటి అత్యాధునిక పరికరాలు, ఆయుధాలను ఉగ్రవాదులకు ఇచ్చి భారత్ పై దాడులకు ప్రేరేపిస్తోందనే మరో సరికొత్త ఆరోపణలకు సంజాయిషీ చెప్పుకోవలసి రావచ్చును. అదే విధంగా పాక్ ఆర్మీకి గుడ్డిగా ఆధునిక పరికరాలను సరఫరా చేస్తున్నందుకు అమెరికా కూడా తల వంచుకోవలసి రావచ్చును. కనుక అవి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైనికులకు ఇచ్చినవని చెప్పి అమెరికా చేతులు దులుపుకోవచ్చును. ఒకవేళ పాక్ ఆర్మీకి ఇచ్చినట్లు చెపినట్లయితే అప్పుడు పాక్ ఆర్మీ కూడా వాటిని ఉగ్రవాదులు తమపై దాడులకు పాల్పడినప్పుడు తమ సైనికుల వద్ద నుండి దొంగతనం చేసారని చెప్పి చేతులు దులుపుకోవచ్చును. అంటే ఎన్.ఐ.ఏ. పని కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లవుతుందేమో?