ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే సర్వేలో మరోసారి వెల్లడయింది. వివిధ అంశాల ప్రాతిపదికగా సమాచారాన్ని సేకరించి.. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ పేరతో గణాంకాలను ప్రతీ ఏడాది ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా ప్రకటించింది. పెద్దరాష్ట్రాల్ల్లో మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. అస్సాం మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా అస్సాం మొదటి స్థానంలో నిలించింది. ఏపీ కూడా గత ఏడాది రెండో స్థానంలో నిలిచింది. కానీ టీడీపీ హయాంలో 2018లో మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంటే వైసీపీ సర్కార్ వచ్చిన ఏడాదికే ఏపీ రెండో స్థానానికి చేరింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.
కరోనా కట్టడి విషయంలోనూ అస్సాం .. అద్దిరిపోయే ప్రదర్శన చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమీ తక్కువ కాదు. మూడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కట్టడి దేశం మొత్తం తమ వైపు చూస్తుందని వైసీపీనేతలన్నారు కానీ.. అస్సాం వైపు చూసినట్లుగా తెలుస్తోంది. మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి వచ్చింది.
మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్‌తో కలిసి ఇండియా టుడే సంస్థ ఈ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. మొత్తం పన్నెండు కీలక రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించి.. ర్యాంకులు ఇస్తుంది. 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ చూస్తూ ర్యాంకులు ఇస్తుంది. ఇందులో ఏపీ దూసుకెళ్తోందని గత ఏడాది నుంచి చెబుతోంది.