ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీతో పాటు పరిస్థితులు కూడా బీజేపీకి కలివివస్తున్న సూచనలుకనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కమలం వికసించే అవకాశం ఉందని ఇండియా టుడే తాజా సర్వే తేల్చింది. మొత్తం 403 సీట్లున్న యూపీలో బీజేపీ 206 నుంచి 216 సీట్లను గెల్చుకోవచ్చని అంచనా వేసింది. అంటే స్పష్టమైన మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందన్న మాట. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ప్రజల మద్దతు తమకే ఉందనే సంకేతాలు శుభపరిణామమంటున్నారు బీజేపీ నేతలు.
అధికార సమాజ్ వాదీ పార్టీ కుటుంబ కలహాలతో పాటు శాంతిభద్రతలను కాపాడలేకపోవడం తదితర కారణాలతోమూల్యం చెల్లించనుంది. సర్వే అంచనా ప్రకారం ఎస్పీ 92 నుంచి 97 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీఎస్పీ 79 నుంచి 85 సీట్లను గెలవవచ్చు. ఇక, కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానం సురక్షితంగానే ఉంటుందట. ఆ పార్టీ 5 నుంచి 9 సీట్లను గెలవవచ్చట.
ఏబీపీ న్యూస్ చానల్ సర్వే ప్రకారం ఎస్పీ, బీజేపీ కాస్త పోటాపోటీగా సీట్లను గెలవవచ్చు. ఎస్పీ చీలిపోతే బీజేపీదే అధికారమని సర్వే అంచనా వేసింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఒక స్థాయికి వచ్చిన తర్వాత అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోతే తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా. యాదవ, మైనారిటీ ఓటు బ్యాంకు అధికార పార్టీ వివిధ రకాల బలం ఉన్న ఎస్పీని దెబ్బతీసే స్థాయికి ఎదగడం శుభపరిణామమని కమలనాథులు ఖుషీగా ఉన్నారు.
పంజాబ్, ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ, మిత్రపక్షాలతే విజయమని ఏబీపీ న్యూస్ టీవీ సర్వే అంచనా వేసింది. అకాలీదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మూడోసారి గెలవడం కష్టమని కొంత కాలంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బాదల్ కుటుంబ పాలనపై విమర్శలు, వ్యతిరేకత, మితిమీరిన డ్రగ్స్ మహమ్మారి, అభివృద్ధి పనులు మందగించడం, ఆమ్ ఆద్మీ పార్టీ బలపడటం ఇందుకు కారణాలు. అయితే స్వీయ తప్పిదాలతో ఆప్ బలహీన పడింది.
వివిధ కారణాలతో బీజేపీ కూటమికే మళ్లీ విజయావకాశాలు ఉన్నాయని ఏబీపీ న్యూస్ సర్వే తేల్చింది. దాని అంచనా ప్రకారం, 117 సీట్లలో కాషాయ కూటమి 50 నుంచి 58 సీట్లు గెలవవచ్చు. కాంగ్రెస్ 41 నుంచి 49 సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక ఆప్ 12 నుంచి 18 సీట్లు గెలవవచ్చట. అయితే బీజేపీ కూటమికి మెజారిటీ సీట్లు రాకపోయినా అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలుస్తుంది. అప్పుడు ఇతర పార్టీల మద్దతు అవసరం అవుతుంది.
ఉత్తరాఖండ్ లోని 70 సీట్లలో బీజేపీ 35 నుంచి 43 సీట్లతో స్పష్టమైన విజేతగా నిలుస్తుందట. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ 22 నుంచి 30 సీట్లకు పరిమితం అవుతుందట. కొండ ప్రాంతంలో బీజేపీకి కొండంత సంతోషాన్నిచ్చే సర్వే అంచనా ఇది.